Paytm Investors : పేటీఎం ఇన్వెస్టర్ల కు మరో ఎదురుదెబ్బ..

దేశంలో బీజేపీ (BJP) ప్రభుత్వం నోట్ల డీమానిటైజేషన్ (Demonetization) ప్రక్రియను ప్రారంభించటంతో డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. ఇదే సరైన సమయంగా భావించిన చాలా కంపెనీలు తమ వ్యాపారాలను ప్రారంభించాయి. అప్పుడు పేటీఎం (Paytm) కంపెనీకి సువర్ణ యుగం ప్రారంభమైంది. కానీ ఇప్పుడు దీనిని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి అయోమయంలో పడింది.

పేటీఎం (Paytm) కంపెనీ ప్లాన్:

దేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపుదారుగా ఉన్న పేటీఎం షేర్లు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే చతికిల పడ్డాయి. దీంతో కంపెనీ పడిపోతున్న తన షేర్లను తానే తిరిగి కొనాలని యోచిస్తోంది. అయితే దీనికి ఒక చిక్కు ఉంది. అదేంటంటే ఏదైనా కంపెనీ ఐపీవో ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన నిధులను మళ్లీ తన షేర్లను కొనుగోలు చేసేందుకు వినియోగించటం కుదరదు. ఇది నియమాలకు పూర్తిగా వ్యతిరేకమని నిపుణులు చెబుతున్నారు.

నివేదిక ప్రకారం:

కంపెనీ నివేదిక ప్రకారం దాని దగ్గర రూ.9,182 కోట్ల లిక్విడిటీ కలిగి ఉంది. ఇవి కంపెనీ దగ్గర అదనంగా ఉన్న నిధులు. వీటికే తన షేర్ల బైబ్యాక్ కార్యక్రమానికి వినియోగించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇది ఇన్వెస్టర్లకు సైతం లాభదాయకంగా ఉంటుందని మేనేజ్‌మెంట్ విశ్వసిస్తున్నట్లు గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం పేర్కొంది. అయితే, ఏ కంపెనీ అయినా IPO ద్వారా వచ్చిన మొత్తాన్ని షేర్ బైబ్యాక్ కోసం ఉపయోగించకుండా నిబంధనలు నిరోధిస్తాయని వర్గాలు తెలిపాయి.

షేర్ల పతనం:

పేటీఎం గతేడాది నవంబర్‌లో ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది. అయితే మార్కెట్ ప్రతికూలతతో పాటు, గ్లోబల్ టెక్ అమ్మకాల మధ్య 2022 సంవత్సరంలో పేటీఎం కంపెనీ షేర్ల విలువ దాదాపు 60 శాతం క్షీణించింది. దీంతో వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయింది. కంపెనీ లాభదాయకత, పోటీతత్వం, మార్కెటింగ్, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ ప్లాన్ వంటి ఆర్థిక అంశాల చుట్టూ అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఐపీవో సమయంలో రూ.2,150గా ఉన్న పేటీఎం షేర్ ధర ప్రస్తుతం NSEలో రూ.539.60 వద్ద ఉంది. అంటే దాదాపుగా 70 శాతం షేర్ ధర క్షీణించింది.

కోలుకుంటున్న కంపెనీ:

సెప్టెంబర్ 2023 చివరి నాటికి కంపెనీ లాభదాయకతను సాధిస్తుందని రెండవ త్రైమాసిక ఫలితాల్లో మళ్లీ పునరుద్ఘాటించింది. ఆదాయం 76 శాతం పెరగటం, నష్టాలు త్రైమాసికంలో 11 శాతం తగ్గటంపై కంపెనీ ఆశాజనకంగా ఉంది. 2021-22లో Paytm రూ.2,325 కోట్లుగా నమోదైంది. అయితే పేటీఎం రుణాల వ్యాపారం చాలా వేగంగా పెరుగుతోంది. మూడవ త్రైమాసికం మెుదటి రెండు మాసాల్లో లోన్ వితరణ ఏడాది ప్రాతిపదికన 374 శాతం పెరిగటం కూడా ఇదే సూచిస్తోంది.

Also Read:  Sea Sand Snow : సముద్రం-ఇసుక-మంచు కలిసే ప్రదేశం గురించి తెలుసుకోవాలని ఉందా?