Russia Ukraine War: ఉక్రెయిన్‌లో ఉన్న‌ మ‌రో 50 మంది భార‌తీయులు

  • Written By:
  • Updated On - March 18, 2022 / 10:26 AM IST

ఉక్రెయిన్ లో సుమారు 50 మంది భారతీయ పౌరులు ఇప్ప‌టికి అక్క‌డే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే వీరిని తిరిగి భార‌త్ కు త‌ర‌లించేందుకు తీసుకోవాల్సిన మార్గాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అన్వేషిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత హంగేరీ, పోలాండ్, రొమేనియా మరియు స్లోవేకియా నుండి ప్రత్యేక విమానాలతో సహా 22,500 మందికి పైగా జాతీయులు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చారు. రెండు మూడు రోజుల క్రితం వరకు దాదాపు 50 మంది భారతీయులు ఉక్రెయిన్‌లో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.

త‌మ‌ అంచనా ప్రకారం 15 నుండి 20 మంది వ్యక్తులు అక్కడ నుండి వెళ్లిపోవాలనుకుంటున్నారని.. మిగిలిన వారు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టంలేద‌ని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. యుద్ధ పరిస్థితిలో వారిని త‌ర‌లించేందుకు తీసుకోవాల్సిన మార్గాల‌ను అన్వేషిస్తామని ఆయ‌న తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ నుండి రష్యాకు వెళ్లే మార్గాలు, దేశం యొక్క పశ్చిమ సరిహద్దులకు దారితీసే మార్గాలు ఉన్నాయి. కొంతమంది భారతీయులు రష్యా నియంత్రణ ప్రాంతంలో ఉన్నందున వారిని రష్యా మీదుగా తరలించామని, వారిని క్రిమియాకు, ఆపై మాస్కోకు తరలించడం సులభమని ఆయన అన్నారు.