Reliance Capital : ధీరూభాయ్ అంబానీ ఓ కుమారుడు ముఖేష్ అంబానీ లాభాల బాటలో ఉండగా.. మరో కుమారుడు అనిల్ అంబానీ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు. ఈక్రమంలోనే ‘రిలయన్స్ క్యాపిటల్’ కంపెనీని విక్రయించేందుకు అనిల్ అంబానీ రెడీ అవుతున్నారు. దీన్ని కొనేందుకు ‘హిందూజా గ్రూప్’ సన్నాహాలు చేస్తోంది. ప్రైవేట్ క్రెడిట్ ఫండ్ ద్వారా రూ. 6660 కోట్లను సేకరించి.. ఆ ఫండ్స్ తో ‘రిలయన్స్ క్యాపిటల్’ను కైవసం చేసుకోవాలని హిందూజా గ్రూప్ భావిస్తోంది. అయితే దీనిపై ‘హిందూజా గ్రూప్’, ‘రిలయన్స్ క్యాపిటల్’ మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.
కొనుగోలుకు బిడ్ దాఖలు..
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు కోసం హిందూజా గ్రూప్ దాఖలు చేసిన బిడ్ ప్రస్తుతం న్యాయస్థానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. 22,000 కోట్ల రూపాయల రుణ చెల్లింపులో రిలయన్స్ క్యాపిటల్ విఫలమైంది. ఈరకంగా అది దివాలా తీయడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాన్ని 2021 సంవత్సరంలోనే స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం దీని అంశం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పరిధిలో ఉంది. రూ. 922.58 కోట్ల పన్నును చెల్లించాలంటూ ఇటీవల రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) నోటీసులు పంపింది.
We’re now on WhatsApp. Click to Join
హిందూజా గ్రూప్ గురించి..
ఇక రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు యత్నాలు చేస్తున్న హిందూజా గ్రూప్ వ్యాపారం ఆర్థిక సేవల రంగం నుంచి మొదలుకొని రసాయనాలు, రియల్ ఎస్టేట్ దాకా విస్తరించి ఉంది. జూలై నుంచే ఈ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు ప్రయత్నాలు మొదలుపెట్టింది. హిందూజా గ్రూప్ వ్యాపారాలు 38 కంటే ఎక్కువ దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ .. హిందూజా గ్రూప్ కు చెందినదే. రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు చేసి ఇండస్ ఇండ్ బ్యాంకును మరింతగా విస్తరించాలనే ప్లాన్ తో హిందూజా గ్రూప్ (Reliance Capital) ఉంది.