Anil Ambani-Pandora Papers case : అనిల్ అంబానీని వెంటాడుతున్న “పండోరా పేపర్స్”.. ఏమిటివి ?

Anil Ambani-Pandora Papers case : అనిల్ అంబానీ భార్య టీనా అంబానీని తాజాగా మంగళవారం ముంబైలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది.. ఇంతకీ ఈ కేసు ఏమిటి ?

  • Written By:
  • Updated On - July 4, 2023 / 02:51 PM IST

ఇప్పటికే సోమవారం అనిల్ అంబానీని  8 గంటల పాటు ఈడీ క్వశ్చనింగ్ చేసింది.. 

ఇంతకీ ఈ కేసు ఏమిటి ?

ఈడీ పిలిచి ఎందుకు ప్రశ్నిస్తోంది ?   

2021లో సంచలనం సృష్టించిన పండోరా పేపర్స్ లోని(Anil Ambani-Pandora Papers case) సమాచారం ఆధారంగా అనిల్ అంబానీ దంపతులను ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. ఆఫ్‌ షోర్ పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.  “లండన్ సమీపంలోని జెర్సీ ద్వీపం, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (BVI), సైప్రస్‌లలో అనిల్ అంబానీ 2007-2010 మధ్య కాలంలో 18 ఆఫ్‌ షోర్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ కంపెనీల పేరిట అనిల్ అంబానీ  దాదాపు రూ.10వేల కోట్ల అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు” అని పండోరా పేపర్స్ లో ప్రస్తావించారు.  ఆ తర్వాత ఈ కంపెనీల్లో లాస్ వచ్చిందంటూ 2021లో UK కోర్టులో అనిల్ అంబానీ దివాలా పిటిషన్ దాఖలు చేశారని అందులో పేర్కొన్నారు.  “జెర్సీలో అనిల్ అంబానీకి మూడు కంపెనీలు ఉన్నాయి. అవి రేడియం అన్‌లిమిటెడ్, బాటిస్ట్ అన్‌లిమిటెడ్, హుయ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్‌లిమిటెడ్. Reliance Innoventures Pvt Ltd పరిధిలో  రేడియం అన్‌లిమిటెడ్, బాటిస్ట్ అన్‌లిమిటెడ్‌.. రిలయన్స్ క్యాపిటల్ AAA ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ పరిధిలో హుయ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్‌లిమిటెడ్‌ ఏర్పాటయ్యాయి” అని పండోరా పేపర్స్ లో ప్రస్తావించారు.

గత ఏడాది ఆగస్టులో..

రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 814 కోట్లకు పైగా ఉన్న రహస్య నిధులపై రూ. 420 కోట్ల పన్నులు ఎగవేసినందుకు నల్లధనం నిరోధక చట్టాల కింద గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. దీంతోపాటు యెస్ బ్యాంక్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ అనిల్ చిక్కుకున్నారు. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్‌తో సహా ఇతర వ్యక్తులతో కలిసి 2020లో ఆయన ఈడీ ముందు హాజరయ్యారు.

Also read : Pawan Kalyan @ Instagram : ఇంస్టాగ్రామ్ లో పవర్ స్టార్.. నిమిషాల్లోనే లక్షల ఫాలోయర్లు

రూ.2000 కోట్లు విదేశాలకు పంపడంపై.. 

అనిల్ అంబానీ 2007 సంవత్సరంలో ఎఫ్‌డీఐ రూపంలో చాలా ఫండ్స్ ను తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అనిల్,  ఆయన అనుబంధ సంస్థలు విదేశాల్లో రుణాల ద్వారా ఫండ్స్ సేకరించి ఎఫ్‌డీఐల రూపంలో భారత్‌కు తీసుకొచ్చారని పలు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఇలా తీసుకొచ్చిన డబ్బును 2015లో మళ్ళీ  విదేశాలకు పంపించి అప్పులు చెల్లించినట్లుగా అనిల్ అంబానీ లెక్కలు  చూపించారని అంటారు. ఈ మొత్తం దాదాపు రూ.2,000 కోట్లు ఉండొచ్చని చెబుతారు. ఈ నిధులు భారత్‌కు రుణం రూపంలో వచ్చాయా ? ఎఫ్‌డీఐ రూపంలో వచ్చాయా ? అనే కోణంలోనూ ఇప్పుడు ఈడీ విచారణ జరుపుతోంది.

పండోరా పేపర్స్ లో ఎంతోమంది ప్రముఖులు  

పనామా పేపర్స్ తరహాలోనే 2021లో  పండోరా పేపర్స్ లీక్  రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 300 మందికి పైగా ప్రముఖుల పన్ను ఎగవేత వ్యవహారాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్(ICIJ)  దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదివరకు పనామా పేపర్ల కుంభకోణాన్ని కూడా బయటపెట్టింది ఈ కన్సా ర్టియమే. భారత్ సహా అనేక దేశాలకు చెందిన ప్రముఖులు పన్ను ఎగవేత కుంభకోణంలో ఉన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టాప్ ఇండస్ట్రీయలిస్ట్ కిరణ్ మజుందార్ షా భర్త, బిట్ కాయిన్ ప్రమోటర్, బ్యాంకులను మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరి.. ఇలా 300 మందికి పైగా భారతీయుల పేర్లు ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. ఇందులో 60 మంది వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.