Site icon HashtagU Telugu

Andhra Anganwadis: అడ్డంకులు ఉన్నా ఆందోళ‌న‌ల‌కు రెడీ.. ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగుల ఢీ

anganwadi Protest

anganwadi Protest

ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌లు ప్రభుత్వానికి చికాకు క‌లిగిస్తున్నాయి. నూత‌న డీజీపీకీ స‌వాలుగా మారాయి. ఉద్యోగుల ఉద్యమంలో సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఊరేగింపులు, ఆందోళ‌న‌లు చేయ‌కుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుండ‌డం, వాటిని ధిక్కరించి ఉద్యోగులు తాము అనుకున్నది చేస్తుండ‌డం ఇటీవ‌ల కాలంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది.

ప్రభుత్వం ఎంతగా అడ్డుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్షలాది మంది ఉద్యోగులు విజ‌య‌వాడ చేరుకొని భారీ ప్రద‌ర్శన చేయ‌డం ఇటీవ‌ల కాలంలో చ‌ర్చనీయాంశంగా మారింది. పోలీసులు అడ్డంకులు క‌లిగించినా మారువేషాల్లో విజ‌య‌వాడ చేరుకోవ‌డం దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యేలా చేసింది. మ‌ళ్లీ అంగ‌న్వాడీ వ‌ర్కర్స్, హెల్పర్స్ కూడా కూడా ఇదే ప‌ద్ధతుల‌ను అనుస‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

జీతాల పెంపుపై ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్వాడీ కార్యక‌ర్తలు జిల్లా క‌లెక్టర్ కార్యాల‌యాల వ‌ద్ద ఆందోళ‌న చేయాల‌ని నిర్ణయించారు. పోలీసులు ఎక్కడిక‌క్కడ వారిని అడ్డుకున్నారు. కొన్ని చోట్ల బ‌స్సుల నుంచి దించివేశారు. అయినా వారు వేరే మార్గాల్లో జిల్లా కేంద్రాల‌కు చేరుకున్నారు. ఇంకొన్ని చోట్ల సాధార‌ణ మ‌హిళ‌ల మాదిరిగా ప్రయాణించి క‌లెక్టరేట్ల వ‌ద్దకు వ‌చ్చారు. పోలీసుల‌ను ఏమార్చారు.

నిర్బంధాలు, బారికేడ్లను అధిగ‌మించి ఆందోళ‌న‌లు చేశారు. ప్రతి జిల్లాలోనూ అనుకున్న విధంగానే క‌లెక్టరేట్ల వ‌ద్ద ధ‌ర్నాలు జ‌రిగాయి. అంగ‌న్వాడీలు వాడీవేడిగా ఉద్యమించ‌డం ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. ఇలాంటి త‌ర‌హా ఉద్యమాల‌కు ఇది మార్గం చూపింద‌న్న డిస్కష‌న్స్ న‌డుస్తున్నాయి.