ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని ఇప్పటికే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం కోసం, ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ నివాసంలోనే ఉంచుతారు. ఆ తర్వాత గౌతమ్ పార్థివ దేహాన్నినెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి తీసుకెళ్తారు. గౌతంరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేస్తున్నారు.
ఇప్పటికే అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రేపు నెల్లూరులోని స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. తనయుడు అర్జున్‌రెడ్డి వచ్చాకే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉండటంతో, గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఆలస్యంమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు రాత్రి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు జిల్లా బ్రాహ్మణ పల్లికి తరలించి, అభిమానుల సందర్శనార్థం మంగళవారం అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత బుధవారం బ్రాహ్మణపల్లిలో మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహిస్తారని సమాచారం. ఇకపోతే మేకపాటి గౌతంరెడ్డి మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలు ప్రకటించింది.