Cyclone: ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న వాయుగుండం.. బుధవారం నాటికి తీరం దాటే అవకాశం!

  • Written By:
  • Publish Date - March 22, 2022 / 11:16 AM IST

ఈ సీజన్ లో ఏర్పడే వాయుగుండాలు ఆస్తి, ప్రాణనష్టానికి కారణమవుతాయంటారు. ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్ ను భయపెడుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇది బలపడి తుపానుగా మారే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీరు చూస్తుంటే.. 12 గంటల్లో ఈ తుపాను అండమాన్ దీవుల వైపు ఉత్తరం దిశగా వెళుతోందంటున్నారు నిపుణులు.

ఈ తీవ్ర వాయుగుండం బుధవారం నాడు మయన్మార్ దేశంలోని తాండ్వే దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల వానలు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ కు వానలు కొత్తకాదు. కానీ అకాలంగా కురిసే ఇలాంటి వర్షాల వల్ల ఆస్తినష్టం భారీగా ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడీ వాయుగుండం వల్ల కూడా అదే జరిగింది. విశాఖ మన్యమే దానికి ఉదాహరణ.

విశాఖ మన్యంలో ఉన్నట్టుండి మేఘాలు కమ్మి వర్షం ప్రారంభమైంది. అది కాస్తా భారీ వర్షంగా మారిపోయింది. కోటవురట్ల, కొయ్యూరు, నర్సీపట్నం, పాడేరు, హుకుంపేట మండలాల్లో వీచిన బలమైన ఈదురుగాలులతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఆ గాలుల వల్ల తోటలతోపాటు పంట నష్టం కూడా తప్పలేదు. పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

చిత్తూరు, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు.