Site icon HashtagU Telugu

AP SSC Exams: పది పరీక్షల్లో ‘ఫ్యాన్’ పరేషాన్!

Fan

Fan

ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రశ్నాపత్రాల పేపర్ లీక్స్ వ్యవహరం చర్చనీయాంశమవుతుండగా, పరీక్షల ఏర్పాట్లలో వసతులు లోపించడంతో విద్యార్థులు ఎగ్జామ్స్ హాల్స్ లో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఏపీలోని సత్యసాయి జిల్లాలోని స్థానిక పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా,  సీలింగ్ ఫ్యాన్ ఆమెపై పడటతో ముఖంపై గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం మళ్లీ పరీక్ష హాల్ కు తీసుకెళ్లారు . పరీక్షకు రెండు రోజుల ముందు మెయింటెనెన్స్‌ నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. “ఇది దురదృష్టకర సంఘటన. మళ్లీ ఏర్పాట్లను పరిశీలించి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని సమాధానం ఇచ్చారు.

అంతకుముందు ఏప్రిల్ 28న కర్నూలు గోనెగండ్లలోని మండల పరిషత్ (అప్పర్ ప్రైమరీ) ఉర్దూ పాఠశాలలో తరగతి జరుగుతున్న సమయంలో సీలింగ్‌లోని ఒక భాగం పడడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనలపై విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. పలు సెంటర్లలో కనీస వసతులు లేవనీ, తీవ్ర ఎండలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.