ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండటంతో ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించకపోయినా మంత్రి వర్గం నుంచి వైదొలగునున్న మినిస్టర్స్‌తో సీఎం జగన్ నేరుగా మాట్లాడతారు.
ఇక వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తున్నదీ చెప్పే అవకాశం ఉంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి విస్తరణ జరుగుతుందని, జగన్ ఇంతక ముందే మంత్రులకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరూ అసంతృప్తికి లోను కావద్దని, అందరికీ అవకాశం వస్తుందని, మంత్రి వర్గంలో చోటు దక్కని వారు, నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తానని జగన్ ఇంతక ముదే చెప్పారు. ఇక ఈరోజు మంత్రి వర్గ సభ్యుల చేత రాజీనామా లేఖలను కూడా తీసుకోనున్నారు. ఈ క్రమంలో 25 మంది మంత్రుల రాజీనామాలను జగన్ తీసుకునే అవకాశముంది. అయితే వీరిలో ఎవరు కొనసాగుతారు, ఎవరు మంత్రి వర్గం నుంచి వెళ్లిపోతారు అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 11వ తేదీ వరకు ఆగాల్సిందే.