AP DGP: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవి విరమణ వీడ్కోలు! తీవ్ర భావోద్వేగానికి గురైన ఏపీ డీజీపీ..

ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. అలాగే, యూనిఫామ్ లేకుండానే భావోద్వేగంగా ఉందని కూడా తెలిపారు. వారి సర్వీసులో అనేక సవాళ్లను చూశారని వ్యాఖ్య చేశారు.

Published By: HashtagU Telugu Desk
AP DGP

AP DGP

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో జరిగిన పరేడ్ కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు అని అన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పని చేశారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానని తెలిపారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు.

నూతన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ… పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తిమేర పని చేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

  Last Updated: 31 Jan 2025, 01:01 PM IST