ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలుమార్చి నెలాఖరు వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు దాదాపు 15 నుంచి 20 రోజులు ఉండేలా నిర్వహించే అవకాశం ఉంటంటున్నారు. మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేసిన అనంతరం వాయిదా పడనుంది.
ఇక మార్చి 8వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం ఉండనుంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా తేదీలను దాదాపుగా ఖరారు చేశారు. మార్చి 11 లేదా 14న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏయే రంగాలకు ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలనే విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. దీంతతో ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ పై అధికారులు కసరత్తు ప్రారంభించగా, బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుందని సమాచారం.