Andhra Pradesh: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు “దిమ్మ‌తిరిగే షాక్” ఇచ్చిన జ‌గ‌న్ స‌ర్కార్..!

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 03:21 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వైసీపీ ప్ర‌భుత్వం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే పీఆర్సీ విష‌యంలో రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వైసీపీ స‌ర్కార్‌కు మ‌ధ్య పెద్ద ర‌గ‌డ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉద్యోగులు చేప‌ట్టిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య స‌యోద్య కుదిరినా, వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఉద్యోగులు హ‌ర్ట్ అయ్యార‌నే సంగ‌తి తెలిసిందే. ఇక పీఆర్సీ వివాదం స‌మ‌సిపోయిందిలే అనుకుంటున్న స‌మ‌యంలో ఉద్యోగులకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.

ఇక‌ముందు ప్ర‌భుత్వ ఉద్యోగులు నిర్ణీత స‌మ‌యానికి ఆఫీసుల‌కు రావాల‌ని, స‌మ‌య‌పాల‌న పాటించ‌కుంటా, కార్యాల‌యాల‌కు ఆల‌స్యంగా వ‌స్తే, లీవ్ పెట్టిన‌ట్టు ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌ని ఏపీ స‌ర్కార్ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు 10 గంల‌కు ఆఫీస్‌కి రావాల‌ని, 10 నిమిషాలు ఆల‌స్య‌మైతే ప‌ర్వాలేదు గానీ, అంత‌కుమించి ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా సెల‌వు ప‌డిపోతుంద‌ని ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌ర్వులో పేర్కొంది. 10 నుంచి 11 గంట‌ల మ‌ధ్య‌లో ఆఫీస్‌కి వ‌చ్చేందుకు నెల‌కు మూడు సార్లు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని, ఆ ప‌రిమితి దాటితే వేత‌నంలో కోత మొద‌లౌతుంద‌ని ఉత్త‌ర్వులో పేర్కొంది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌పై రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.