Site icon HashtagU Telugu

TTD: శ్రీవారి చెంతన ‘శ్రీనివాస సేతు’ ఫ్లైఓవర్!

Srinivasa Setu

Srinivasa Setu

కేంద్ర ప్రభుత్వ నిధుల‌తో చిత్తూరు జిల్లా తిరుప‌తిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవ‌ర్ తొలి ద‌శ నిర్మాణ ప‌నులు పూర్తయ్యాయి. తిరుమలకు వ‌చ్చే శ్రీవారి భక్తులకు ప్రయాణ సౌక‌ర్యాలను మ‌రింత విస్తరించే ల‌క్ష్యంతో ఈ ఫ్లై ఓవ‌ర్‌ను నిర్మిస్తున్నారు. శ్రీనివాస సేతు నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయల నిధుల‌ను కేటాయించింది. ఫిబ్రవ‌రి తొలి వారంలో ఈ ఫ్లై ఓవ‌ర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు.

శ్రీనివాస సేతు తొలిద‌శ‌లో బ‌స్టాండు ఎదురుగా ఉన్న‌ శ్రీనివాస వ‌స‌తి స‌ముదాయం నుంచి క‌పిల తీర్థం వ‌ద్ద ఉన్న‌ నంది స‌ర్కిల్ వ‌ర‌కు సుమారు 3 కిలో మీట‌ర్ల మేర ప‌నులు పూర్తయ్యాయి. మ‌రోవైపు తిరుప‌తి బ‌స్టాండు నుంచి తిరుచానూరు హ‌స్తక‌ళారామం వ‌ర‌కు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు రెండో ద‌శ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. తిరుపతి స్మార్ట్ సిటీ నిధులను కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. రెండవ దశ పనులు మరో ఆరునెలల్లో పూర్తి కానున్నాయ‌ని సంబంధిత అధికారులు తెలిపారు.