YSRCP : ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికే వైసీపీ మ‌ద్ద‌తు

  • Written By:
  • Updated On - June 24, 2022 / 11:16 AM IST

అమరావతి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌న మ‌ద్దతును తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగానే ఇది వస్తుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గత మూడు సంవత్సరాల్లో సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. మంత్రివర్గంలో వారికి మంచి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకున్నారు. అయితే, గతంలో షెడ్యూల్ చేసిన కేబినెట్ సమావేశం కారణంగా ద్రౌపది ముర్ము నామినేషన్ల దాఖలుకు సీఎం హాజరుకాలేక‌పోతున్న‌ట్లు సీఎంవో కార్యాల‌యం తెలిపింది. సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి బదులుగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల నేతలు విజయ సాయి రెడ్డి, లోక్‌ సభ సభ్యుడు మిధున్‌ రెడ్డి హాజరవుతార‌ని తెలిపింది. అంతకుముందు రోజు ముర్ము ఢిల్లీకి చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పదవికి జూలై 18న ఎన్నికలు జరగనున్నాయి. ద్రౌపది ముర్ము ఈ రోజు (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు.