Site icon HashtagU Telugu

Anand Mahindra : 68వ వసంతంలోకి ఆనంద్ మహీంద్రా : ఎదిగినా ఒదిగి ఉండే “సోషల్” హీరో

Anand Mahindra Turns 68.. A 'social' Hero Who Grows Up

Anand Mahindra Turns 68.. A 'social' Hero Who Grows Up

Anand Mahindra : మనదేశంలో టాప్ 10 బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాల్లో ఆయన ఒకరు. అయితే అందరిలోనూ వెరీ వెరీ స్పెషల్ గా ఉంటారు.. మిగితా పారిశ్రామిక దిగ్గజాలు అస్తమానం పనుల్లో బిజీగా గడుపుతుంటే.. ఈయన ఓ వైపు తన వ్యాపార బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. సామాన్యుల స్ఫూర్తిదాయక విజయాలను అందరితో షేర్ చేస్తూ ఉంటారు. ఈ వర్ణనలను బట్టి ఆ స్నేహశీల, మృదు స్వభావ కుబేరుడు ఎవరో మీరు అర్ధమై ఉంటుంది. ఆయనే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). ఈనెల 1వ తేదీనే ఆయన 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈనేపథ్యంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆ నిరాడంబర వ్యాపార దిగ్గజం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

ఇండియాలో నంబర్ 1 రిచెస్ట్ ఎప్పుడవుతారు ?

ఆనంద్ మహీంద్రా 1955 మే 1న బొంబాయిలో దివంగత పారిశ్రామికవేత్త హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. మహీంద్రా వంశంలో మూడో తరం వారసుడు ఆనంద్ మహీంద్రా. ఆయన అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చేశారు. 1981లో మహీంద్రా గ్రూప్‌లో చేరారు. కంపెనీని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం 19 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం కలిగిన మహీంద్రా & మహీంద్రా గ్రూప్‌కు ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. వీరి పెట్టుబడులు ప్రధానంగా మహీంద్రా & మహీంద్రా కంపెనీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో వాటాల రూపంలో ఉన్నాయి. 2022లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన ఇండియా సంపన్నుల జాబితాలో 2.1 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో ఆనంద్ మహీంద్రా 91వ స్థానంలో నిలిచారు. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

” మీరు భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడు నంబర్ 1 ర్యాంక్ కు వస్తారు ” అని గత సంవత్సరం ప్రారంభంలో ఒక నెటిజన్ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించగా ఇలా ఆన్సర్ ఇచ్చారు. “నిజం ఏమిటంటే నేను ఎప్పటికీ ధనవంతుడిని కాలేను. ఎందుకంటే ఇది నా కోరిక కాదు” అని ఆయన తేల్చి చెప్పారు. ఆనంద్ మహీంద్రా తరచుగా ఆఫ్-బీట్ అంశాలపై పోస్ట్‌లను సోషల్ మీడియాలో పంచుకుంటారు. వ్యాపారం కాకుండా స్ఫూర్తిదాయకమైన కథనాలను షేర్ చేస్తారు. నెటిజన్స్ ప్రశ్నలకు జవాబులు కూడా ఇస్తారు.

ఆనంద్ మహీంద్రా నాయకత్వంలో మహీంద్రా గ్రూప్ వృద్ధి:

మహీంద్రా & మహీంద్రా 1945లో JC మహీంద్రా, KC మహీంద్రా మరియు మాలిక్ గులాం ముహమ్మద్ వ్యాపార గ్రూపుల ద్వారా ఉక్కు వ్యాపారం చేయడానికి పంజాబ్‌లోని లూథియానాలో మహీంద్రా & మహమ్మద్‌ అనే విలీన కంపెనీగా ఏర్పడింది. రెండు సంవత్సరాల తర్వాత 1947లో మాలిక్ గులాం ముహమ్మద్ ఈ కంపెనీలో తన వాటాను విడిచిపెట్టి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. ఆనంద్ మహీంద్రా 1997లో ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012 ఆగస్ట్ లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 53,000 కోట్లు ఉన్న సమయంలో తన మేనమామ కేషుబ్ మహీంద్రా నుంచి బోర్డ్ ఛైర్మన్, మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలో మహీంద్రా & మహీంద్రా గ్రూప్ రూ. 1.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ను కలిగి ఉంది. ఈ కంపెనీ నేడు ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్‌తో సహా 22 రంగాలకు కార్యకలాపాలను విస్తరించింది. ఆటోమోటివ్, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక సేవలు, IT, మౌలిక సదుపాయాల అభివృద్ధి సేవలు, స్టీల్ ట్రేడింగ్‌తో సహా ఆరు వ్యూహాత్మక వ్యాపార విభాగాలను కూడా ప్రారంభించింది.

వాహన రంగంలో విప్లవం:

ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో మహీంద్రా బొలెరో, మహీంద్రా స్కార్పియోను మార్కెట్లోకి లాంచ్ చేశారు. మహీంద్రా కంపెనీ ఇవాళ ట్రాక్టర్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బాగా ప్రసిద్ధి చెందింది. 2010లో మహీంద్రా గ్రూప్ FIFA ప్రపంచ కప్‌ను స్పాన్సర్ చేసింది. 2014లో FIA ఫార్ములా E ఛాంపియన్‌షిప్‌లలోకి ప్రవేశించింది. 2021లో ఆనంద్ మహీంద్రా XUV 700 SUVని, 2022లో స్కార్పియో యొక్క కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఆనంద్ మహీంద్రా కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో కూడా వాటాను కలిగి ఉన్నారు .అయితే అందులో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా తన పాత్రను వదులుకున్నారు. 2020 ఏప్రిల్లో మహీంద్రా & మహీంద్రా యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు.

Also Read:  Transport Business: బెస్ట్.. ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా : ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం