Site icon HashtagU Telugu

Amit Shah: ఒవైసీ కారుపై దాడి ఘటనపై అమిత్ షా ప్రకటన!

Owaisi Attack Imresizer

Owaisi Attack Imresizer

గత వారం ఉత్తరప్రదేశ్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.
న్యూఢిల్లీకి వెళ్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఒవైసీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేయగా, హత్యాయత్నం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రెండు పిస్టల్స్‌, మారుతీ ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణ సమయంలో నిందితులు ఇద్దరూ ఒవైసీ, అతని పార్టీ కార్యకర్తల రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు కార‌ణంగానే ఈ సంఘటనకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దాడి నేపథ్యంలో ఒవైసీకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జెడ్ భద్రతను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కల్పించింది. ఈ భ‌ద్ర‌త‌ను ఓవైసీ తిరస్కరించారు. తనకు చావంటే భయం లేదని, ఎ కేటగిరీ పౌరుడిగా జీవించాలని కోరుకుంటున్నానని ఓవైసీ అన్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉదయం 10.30 గంటలకు రాజ్యసభలో, సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది.