Site icon HashtagU Telugu

Amit Shah Operation K’taka: కర్ణాటకలో ఆపరేషన్ మైసూర్.. అమిత్ షా భారీ స్కెచ్!

amit shah

amit shah

కర్ణాటకలో కమలం సీన్ ను అధిష్టానం మార్చబోతోంది. అక్కడ ఒంటరిగానే 80-90 సీట్లలో గెలుపు జెండా ఎగరేయగలదు. కానీ పవర్ కావాలనుకున్న ప్రతిసారీ దాదాపు 20 సీట్ల కోసం వేరే పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ఈసారి సొంతంగానే పూర్తిస్థాయి మెజారిటీని సాధించడానికి రంగం సిద్ధం చేస్తోంది. బీజేపీకి ఎక్కువగా కరావళి, బెంగళూరు, మలెనాడు, ఉత్తర కర్ణాటకలో సీట్లు వస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ బలం బాగానే ఉన్నా.. మైసూరులో మాత్రం కాషాయ జెండా అనుకున్నంతగా రెపరెపలాడడం లేదు.

ఈసారి ఆపరేషన్ మైసూరు పేరుతో ప్రత్యేకమైన ప్లాన్ ని పార్టీ హైకమాండ్ రెడీ చేసింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అమిత్ షా కనుసన్నల్లోనే ఉంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం అనంతకుమార్, యడియూరప్ప భుజస్కందాలపైనే ఆ తంతు సాగేది. వాళ్లేమో పార్టీ బలంగా ఉన్నచోటే పాగా వేసేవారు. మైసూరును వదిలేసేవారు. కానీ ఈసారి అమిత్ షా ఆ స్కెచ్ మార్చేశారు.

మైసూరులో దేవెగౌడకు ఇంకా గట్టు పట్టుంది. పైగా ఆయన సామాజికవర్గం వారు అక్కడ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి యడియూరప్ప ప్రయత్నించినా సాధ్యపడలేదు. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఉత్తర కర్ణాటకకు చెందినవారే కావడంతో పాత మైసూరును టార్గెట్ గాచేసుకున్నారు. ఢిల్లీ నేతలు చెప్పిన ప్లాన్ ను అలాగే అమలు చేయాలని చెప్పారని టాక్.

పాత మైసూరులో కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ కు పట్టుంది. అక్కడ మొత్తం 84 సీట్లు ఉన్నాయి. వీటిలో నాలుగో వంతు స్థానాలు అంటే 21 సీట్లు సాధిస్తే.. బీజేపీ సొంతంగానే పవర్ లోకి రాగలుగుతుంది. అందుకే ఎన్నికలకు ఇంకా సమయమున్నా సరే.. ఆరు నెలల ముందుగానే.. ఇక్కడ పట్టు సాధించడానికి రెడీ అవుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ లో పొసగని నాయకులకు గాలాన్ని వేయనుంది. మే నెలలో ఈ ఆట
మొదలుపెట్టనుంది.

మే నెలలో మాండ్యాలో అమిత్ షా బహిరంగ సభ ఉంది. బెంగళూరు-మైసూరు పది లేన్ల ఎక్స్ ప్రెస్ రహదారిని దసరా సమయానికి ప్రధాని మోదీ ప్రారంభించేలా ప్లాన్ చేశారు. పాత మైసూరులో ఒక్కలిగరదే కంచుకోట. అందుకే అక్కడి నుంచి ఇప్పటికే కొంతమంది నేతలతో అమిత్ షా మంతనాలు జరిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వీరంతా కమలతీర్థం పుచ్చుకుంటారు. ఈ లిస్టులో సుమలత కూడా ఉన్నట్టు
టాక్. వీరంతా బీజేపీకి అనుకూలంగా గ్రౌండ్ ని చక్కదిద్దాక.. పార్టీలోకి ఎంటరవుతారు.

Exit mobile version