Pawan Kalyan: అంబేద్కర్ నా హీరో …పవన్ కళ్యాణ్

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ తన హీరో అని, ఆయన గొప్పతనం గురించి చాలా లోతుగా అధ్యయనం చేశానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 06:13 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ తన హీరో అని, ఆయన గొప్పతనం గురించి చాలా లోతుగా అధ్యయనం చేశానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా నటుడు రాజకీయాల్లోకి రాగానే ఎన్టీఆర్‌తో పోల్చుతారని, ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తితో పోటీ పడలేం అని చెప్పారు. అధికారం కొందరికే పరిమితమైందని, అలా ఎందుకు పరిమితమైదో మనం ఆలోచన చేయాలని అన్నారు.
అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం వంటి పదాలు తనలో బలంగా నిలిచాయని చెప్పారు. అయితే, తన దగ్గర డబ్బులు లేవన్నారు. కానీ, అవన్నీ చేయాలనే సంకల్పం బలంగా ఉందని స్పష్టం చేశారు. మార్పు కోసం ఎంతోమంది త్యాగం చేసినట్లు గుర్తు చేశారు.

పార్టీ నిర్మాణం చేయాలంటే డబ్బు ఒక్కటే సరిపోదని చెప్పారు. బలమైన సంకల్పం ఉంటేనే పార్టీ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఎన్ని అవమానాలు జరిగినా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. 2019లో ఓడిపోయాక పార్టీ వదిలి పారిపోతానని అనుకున్నారన్నారు. 2014లో తాను టీడీపీకి గుడ్డిగా మద్దతు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత అన్నీ ఆలోచించే అప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ వారు ఆనాడు అమరావతి రాజధానిగా ఒప్పుకొని ఇప్పుడు మూడు రాజధానులు అని మాట మార్చడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదని తాను చెప్పినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.