ఐపీఎల్ 15వ సీజన్ రికార్డుల మోత మోగుతోంది. ఇటు బ్యాటర్లు…అటు బౌలర్లు వ్యక్తిగత రికార్డులతో హోరెత్తిస్తున్నారు. తాజాగా తెలుగుతేజం అంబటి రాయుడు అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసిన 13వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ ఘనత సాధించి 10వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ధోనీ, రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్, దినేశ్ కార్తీక్ , రహానే 4 వేల పరుగుల క్లబ్ లో ఉన్నారు. అలాగే 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న విదేశీ ఆటగాళ్ళ జాబితాలో డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, డివీలియర్స్ ఉన్నారు. ఐపీఎల్‌లో రాయుడు గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడగా… ప్రస్తుతం చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఇప్పటివరకు 181 మ్యాచ్‌లాడిన రాయుడు 29 సగటుతో 4044 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు..
ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులుగా ఉంది. మొత్తంగా 126 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన రాయుడు 337 ఫోర్లు, 154 సిక్సులు బాదాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ పెద్దగా రాణించలేదు. అయితే గుజరాత్ టైటాన్స్ పై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. ఈ సీజన్ కు ముందు చెన్నై రాయుడిని వేలంలోకి వదిలేసింది. మెగా వేలంలో సన్ రైజర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రాయుడు కోసం పోటీ పడినప్పటకీ… చెన్నై సూపర్ కింగ్స్ 6.75 కోట్లకు అతన్ని దక్కించుకుంది.
Pic Courtesy- CSK/Twitter