IPL TV Rights: జాక్ పాట్ ఖాయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్...ప్రపంచ క్రికెట్ లోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్. కేవలం క్రేజ్ లోనే కాదు బీసీసీఐ నుండి ఆటగాళ్ళ వరకూ..

  • Written By:
  • Updated On - February 21, 2022 / 08:16 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్…ప్రపంచ క్రికెట్ లోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్. కేవలం క్రేజ్ లోనే కాదు బీసీసీఐ నుండి ఆటగాళ్ళ వరకూ…ఫ్రాంచైజీల నుండి స్పాన్సర్ల వరకూ కాసుల వర్షం కురిపించే లీగ్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రధాన ఆదాయపు వనరు. లీగ్ కు సంబంధించి ఏ అంశం అయినా బోర్డుకు మాత్రం కాసుల పంటే. ఇప్పటికే రెండు కొత్త టీమ్స్ ఎంట్రీతో భారీగా ఆర్జించిన బీసీసీఐకి ఇప్పుడు మరో జాక్ పాట్ తగలనుంది. లీగ్‌ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయి. వచ్చే అయిదేళ్ల కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా 50 వేల కోట్ల వరకూ ఆర్జించబోతోంది. ఈ సారి ప్రసార హక్కులు కోసం ప్రపంచంలోనే పలు పెద్ద కార్పొరేట్ కంపెనీలు పోటీ పడడమే దీనికి కారణం.

గతంలో ఐపీఎల్‌ ప్రసార హక్కులు 2012 నుంచి 2017 సోనీ గ్రూపు చేతిలో ఉండేవి. ఆ తర్వాత జరిగిన వేలంలో 2018 నుంచి 2022 వరకూ అయిదేళ్ల కాలానికి గాను 16,347 కోట్లు చెల్లించి స్టార్‌ ఇండియా.. ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్లకు మరో మూడు రెట్లు ధర పలికే అవకాశాలున్నాయి. అటు టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కులకు కలిపి 35 నుండి 40 వేల కోట్ల ధర పలకవచ్చని అంచనా. ప్రస్తుతం అమెజాన్- సోనీ, రిలయన్స్ కంపెనీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఐపీఎల్ హక్కులు దక్కించుకునే ప్లాన్‌లో సోని పిక్చర్స్‌తో కలిసి అమెజాన్‌ బిడ్‌ వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 21 వేల కోట్లకు పైగానే మార్కెట్‌ వర్గాలు అంచనా ప్రకారం శాటిలైట్‌, డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రసార హక్కుల కోసం ప్రైమ్‌ వీడియోస్‌, సోని పిక్చర్స్‌ సంయుక్తంగా 3 నుంచి 4 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నాయి.
మరోవైపు రిలయన్స్ తన బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్ 18 కోసం 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించడానికి విదేశీయులతో సహా ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. గతంలో మ్యాచ్‌కు 54.5 కోట్లు చెల్లించేలా స్టార్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. వచ్చే సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రసార హక్కుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సీజన్ నుంచి ఒక్కో మ్యాచ్ కూ కనీసం 70 కోట్ల వరకు బోర్డు ఆర్జించబోతోంది. కాగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ బిడ్డింగ్ రేసులో అమెజాన్ ముందున్నట్టు తెలుస్తోంది.