Site icon HashtagU Telugu

Allu Arjun: అల్లు అర్జున్ కోసం రంగంలోకి మామ? గాంధీ భవన్ లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..

Kancharla Chandrashekar Reddy In Gandhi Bhavan

Kancharla Chandrashekar Reddy In Gandhi Bhavan

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఇవాళ(సోమవారం) గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, గాంధీభవన్‌లో తమ పార్టీ ప్రెస్‌మీట్‌ జరుగుతుండగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడకు వచ్చారని తెలిపారు. ప్రెస్‌మీట్‌ జరుగుతుంది అని ఆయన బయటకు వెళ్ళిపోయి తర్వాత తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. మీరు ఇప్పుడు పార్టీ మీటింగ్స్ లో ఉన్నారు కదా, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారని మహేష్ కుమార్ గౌడ్‌ అన్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడు అని అలాగే, కాంగ్రెస్ వాది అని తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడుతానని.. ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్‌ అన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ:

సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందినట్లు, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసిందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో A11గా ఉన్న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు చెప్పారు.

ఈ విషయంపై రాజకీయ లబ్ధి కోసం తెలుగు చిత్రసీమ చరిత్ర తెలియని వారు మాట్లాడుతున్నారని విమర్శించారు. “బాధ్యత గల పదవిలో ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఆయనకు తెలవదా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కూడా అడ్డగోలుగా ఈ అంశంపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలుగు చిత్రసీమకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్లకు తెలుసా?” అని ప్రశ్నించారు.

“తెలుగు చిత్రసీమ హైదరాబాద్ ఎలా వచ్చిందో వీళ్లకు తెలుసా?” అని నిలదీశారు. “పుష్ప-2కి కూడా వెసులుబాటు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని” గుర్తు చేశారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకొని, నిర్దిష్టంగా మాట్లాడితే మంచిదని, ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు.