Indian Film@Cannes: కేన్స్ లో కేక పుట్టించిన ఇండియా డాక్యుమెంటరీ.. ప్రతిష్టాత్మక అవార్డు కైవసం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక భారతీయ డాక్యుమెంటరీ అందరి మది దోచింది.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 11:04 AM IST

ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక భారతీయ డాక్యుమెంటరీ అందరి మది దోచింది. అంతేకాదు డాక్యుమెంటరీ లకు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డు లోయిల్ డియోర్(L’Oeil d’Or) ను కైవసం చేసుకుంది. కేన్స్ వేదికగా భారత సత్తా చాటిన ఆ డాక్యుమెంటరీ పేరు ” ఆల్ దట్ బ్రెథ్స్” (all that breaths) . అవార్డులో భాగంగా దీనికి రూ.4.16 లక్షల క్యాష్ ప్రైజ్ ను ఇచ్చారు.

ఢిల్లీకి చెందిన ఔత్సాహిక చిత్ర దర్శకుడు శౌనక్ సేన్ ఈ మూవీని నిర్మించారు. మనుషుల చర్యల వల్ల, వేటగాళ్ల కారణంగా గాయాలపాలయ్యే బ్లాక్ కైట్ పక్షులను రక్షించి, చికిత్స అందించే ఇద్దరు సోదరుల చుట్టూ దీని కథ తిరుగుతుంది. మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ అనే బ్రదర్స్ బ్లాక్ కైట్ పక్షులను రక్షించి తేవడం, చికిత్స చేయడం అనే అంశమే ప్రధానంగా ఈ డాక్యుమెంటరీ ఉంటుంది.

ఈ ఏడాది అమెరికాలో జరిగిన సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ వరల్డ్ డాక్యుమెంటరీ విభాగంలో గ్రాండ్ జ్యురీ బహుమతి ని ” ఆల్ దట్ బ్రెథ్స్” దక్కించుకుంది. తాజాగా దీన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డుకు ఎంపిక చేసిన జ్యురీ టీమ్ లో దేశ,విదేశాల ప్రముఖ రచయితలు, దర్శకులు ఉన్నారు.ఈ డాక్యుమెంటరీ కి చెందిన హక్కులను ఇటీవల hbo సంస్థ చేజిక్కించుకుంది. వచ్చే ఏడాది దీనికి సంబంధించిన మూవీని అమెరికాలో విడుదల చేస్తారు. ఆ వెంటనే hbo max టీవీ ఛానల్ లో ఈ డాక్యుమెంటరీ ని ప్రసారం చేస్తారు.