AP Cabinet:ఏపీ క్యాబినెట్ లో మార్పులకు కౌంట్ డౌన్ మొదలైందా? ఏప్రిల్ 7న ఏం జరగనుంది?

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైపోయిందా? ఎందుకంటే ఏప్రిల్ 7న ఏపీ క్యాబినెట్ మీటింగుంది. సీఎం జగన్ అనుకున్నది అనుకున్నటు చేస్తే..

  • Written By:
  • Updated On - March 30, 2022 / 09:38 AM IST

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైపోయిందా? ఎందుకంటే ఏప్రిల్ 7న ఏపీ క్యాబినెట్ మీటింగుంది. సీఎం జగన్ అనుకున్నది అనుకున్నటు చేస్తే.. ప్రస్తుత మంత్రులకు అదే చివరి క్యాబినెట్ సమావేశం కావచ్చు. అంటే మరో పది రోజుల్లో ప్రస్తుత మంత్రులంతా మాజీలయ్యే ఛాన్సుంది. అసలు ఇంతమంది మంత్రులను ఎందుకు మారుస్తున్నారు అనడనికి రీజనేమీ లేదు. జగన్ ముందే చెప్పారు.. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని మారుస్తానని.

ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్న 25 మందిలో నలుగురైదుగురికి తప్ప మిగిలినవారి నుంచి రాజీనామో కోరే అవకాశముంది. ఏప్రిల్ 7న జరిగే మీటింగ్ లోనే వారికి దీనిపై స్పష్టత ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 8న గవర్నర్ ను కలిసి.. క్యాబినెట్ లో మార్పుల గురించి వివరిస్తారని ఏపీ పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదయ్యాక ఏప్రిల్ 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒకవేళ ప్లాన్ మారితే.. ఏప్రిల్ 7న డైరెక్ట్ గా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.

క్యాబినెట్ లో ఆలస్యంగా చేరిన సీదిరి అప్పలరాజు, వేణు వంటివారిని కొనసాగించే ఛాన్సుంది. ఇక ధర్మాన కృష్ణదాస్ వంటివారిని కొనసాగిస్తారా లేదా అన్నది వైసీపీ వర్గాలకే అంతుబట్టడం లేదు. మంత్రులుగా తప్పుకున్న వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్సుంది. కాకపోతే బొత్సా, బాలినేని, పెద్దిరెడ్డి వంటి వారిని మంత్రులుగా తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. వారికి ఎలా సర్దిచెబుతారన్నది చాలా కీలకంగా మారింది.

చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిని కాని తప్పిస్తే.. జిల్లా నుంచి వేరే ఎవరికీ మంత్రి పదవి ఇవ్వకూడదు అని ఆయన షరతు విధించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో ఇంకా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు లేకపోయినా ప్రస్తుత మంత్రుల్లో కొందరు నిరాశతోనే ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే కరోనా వల్ల తమ పెర్ ఫార్మెన్స్ ను పూర్తిగా చూపే అవకాశం రాలేదని వాపోతున్నారని పార్టీ వర్గాల టాక్.