Kadam Dam : క‌డెం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు.. అన్ని గేట్లు ఎత్తివేత‌

తెలంగాణ‌లోని క‌డెం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజామున జలాశయంలోకి భారీగా వర్షపు నీరు వ‌చ్చింది

  • Written By:
  • Updated On - July 13, 2022 / 12:12 PM IST

తెలంగాణ‌లోని క‌డెం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజామున జలాశయంలోకి భారీగా వర్షపు నీరు వ‌చ్చింది. ఆదిలాబాద్ జిల్లా కడం డ్యాం వద్ద పనిచేస్తున్న తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు విపత్తు నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించారు.ఈ ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం ఉంది. ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు దాటితే వరద నిర్వహణ పై అధికారులు ఎమీ చేయ‌లేని ప‌రిస్థితి. కాబట్టి విపత్తు నిర్వహణకు సిద్ధం కావడం తప్ప మరో మార్గం లేద‌ని నీటిపారుద‌ల శాఖ అధికారులు అంటున్నారు.

1995లో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు చిన్నపాటి నష్టాలతో డ్యాం సమస్య నుంచి బయటపడిందని ఇంజినీర్లు తెలిపారు. ప్రకృతి మానవ ప్రయత్నానికి మించి విజృంభిస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతామ‌ని అధికారులు తెలిపారు, ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్లు గేజింగ్ రూమ్‌లో ఉండి వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. భారీ వర్షాల కారణంగా గోదావరి బేసిన్‌లోని అన్ని రిజర్వాయర్లు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 74.83 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల (టీఎంసీ) నీటి మట్టం చేరిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 81,730 క్యూసెక్కులు ఉండగా, అధికారులు తొమ్మిది గేట్లను తెరిచి 86,118 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్‌ జిల్లాలోని కొమరం భీమ్‌ ప్రాజెక్టు గేట్లను తెరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగట్ట, సరస్వతి, పార్వతి బ్యారేజీలకు కూడా ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. నీటిని విడుదల చేసేందుకు అధికారులు గేట్లు తెరిచారు.