Site icon HashtagU Telugu

AP New Cabinet: ఏపీలో మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఆ ఐదారుగురు వారేనా?

Ys Jagan Ap New Cabinet

Ys Jagan Ap New Cabinet

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులంతా రాజీనామా చేశారు. కానీ అందులో ఐదారుగురికి మళ్లీ అవకాశం ఇస్తాను అని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఐదుగురు ఎవరా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి పదవులను కోల్పోయిన వాళ్లంతా ముభావంగా, నిస్తేజంగా ఉన్నట్టు సమాచారం. తమ పని తీరు చూసైనా మరో అవకాశం ఇవ్వచ్చు కదా అన్న బాధ వారిలో కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

మరి మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఆ ఐదారుగురు ఎవరు? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్. జగన్ మొత్తం మంత్రివర్గాన్ని మార్చేస్తానని రెండున్నరేళ్ల కిందటే చెప్పినా అది సాధ్యపడలేదు. ఎందుకంటే.. సామాజికవర్గం లెక్కలు, ఇతర సమీకరణాల దృష్ట్యా కొంతమందిని కచ్చితంగా కొనసాగించాల్సిన పరిస్థితి. అందుకే వేరే దారిలేక ఐదారుగురిని కొనసాగిస్తా అని చెప్పారు.

మళ్లీ మంత్రి పదవులను ఆశించేవారి జాబితా ఎక్కువగానే ఉన్నా వారిలో ఎక్కువ అవకాశాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేశ్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, శంకరనారాయణ, సీదిరి అప్పలరాజు.. వీరిలో ఐదారుగురికి మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వీరిలో ఏ ముగ్గురో, నలుగురినో తీసుకుంటే మాత్రం.. మిగిలినవారిలో మరో ఇద్దరు ముగ్గురికి అవకాశం ఉంటుంది.

మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తమకు లేవని కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు ముందే చెప్పేశారు. అందుకే మిగిలినవారు ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు.