Site icon HashtagU Telugu

Air India: ఎయిర్ ఇండియా అధికారిపై దాడి చేసిన ప్రయాణికుడు.. చివరికి?

Flight Ticket Offers

Flight Ticket Offers

ఇటీవల కాలంలో విమానంలో ప్రయాణించే కొందరు ప్రయాణికుల వికృత చేష్టల వల్ల విమాన సిబ్బందికి ఇబ్బంది కలగడంతో పాటు తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ప్రయాణికుడు గాలిలో ప్రయాణిస్తున్న విమానం తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు. దాంతో విమాన సిబ్బంది అధికారులు అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇలా నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక ప్రయాణికుడు ఏకంగా ఎయిర్‌ఇండియా అధికారి చెంపను పగలగొట్టాడు.

ఈ ఘటన సిడ్నీ నుంచి ఢిల్లీ వెళ్లుతున్న ఎయిర్ ఇండియా AI301 విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా సీనియర్‌ అధికారి సీటు సరిగా లేకపోవడంతో తన సీటును ఎకానమీ లోకి మార్చుకున్నారు. అతడి పక్కనున్న మరో ప్రయాణికుడు బిగ్గరగా మాట్లాడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. దాంతో అధికారి అతడిని మెల్లగా మాట్లాడాలని సూచించారు. అది నచ్చని ప్రయాణికుడు ఆగ్రహానికి గురై అధికారి చెంపను పగలగొట్టాడు. అంతే కాకుండా ఆయన తలను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడాడు.

దీంతో ఐదుగురు సిబ్బంది ఆ ప్రయాణికుడి వద్దకు వచ్చి,అలా చేయద్దని హెచ్చరించారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదు. విమానం ఢిల్లీ చేరుకున్న అనంతరం ప్రయాణికుడిని భద్రతా ఏజెన్సీకి అప్పగించినట్లు ఎయిర్‌ ఇండియా అధికారి తెలిపారు. విమానంలో ప్రయాణికులు ఎలా ఉండాలో సూచించినప్పటికీ అతడు అనుచితంగా ప్రవర్తించి సిబ్బందిలో ఒకరిని గాయపరిచాడు. తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. అతడ్ని భద్రతా ఏజెన్సీకి అప్పగించిన తరువాత లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని ఎయిర్‌ఇండియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.