Site icon HashtagU Telugu

IPL: గుజరాత్ టైటాన్స్ బోణీ

gujarat titans

gujarat titans

ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తమ ఎంట్రీని గ్రాండ్ గా ఇచ్చింది. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో ఎవరూ ఊహించని విధంగా తడబడింది. షమీ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయడంతో లక్నో 29 పరుగులకే కీలక 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్ ప్లేయర్ దీపక్ హుడా(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55)‌తో కలిసి యువ ఆటగాడు ఆయూష్ బాదోని(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా..వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కూడా తడబడింది. కేవలం 15 పరుగులకు 2 వికెట్లు చేజార్చుకుంది. శుబ్ మన్ గిల్ డకౌట్ అవగా…విజయ్ శంకర్ విఫలమయ్యాడు. అయితే వేడ్, హర్ధిక్ పాండ్య ధాటిగా ఆడడంతో కోలుకుంది. హర్థిక్ 33, వేడ్ 30 రన్స్ కు ఔటయ్యారు. ఈ దశలో డేవిడ్‌ మిల్లర్, తెవాటియా జట్టుకు ఆపద్భాంధవులయ్యారు.ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు చేయాల్సి ఉండగా… దీపక్‌ హుడా వేసిన 16వ ఓవర్లో తెవాటియా 6, 4 కొడితే మిల్లర్‌ కూడా 4, 6 బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఇదే జోరుతో తెవాటియా… రవి బిష్ణోయ్‌ వేసిన 17వ ఓవర్‌నూ ఆడుకున్నాడు. ఒక సిక్స్, 2 ఫోర్లతో ఆ ఓవర్లో కూడా 17 పరుగులు రావడంతో విజయసమీకరణం 18 బంతుల్లో 29 పరుగులుగా మారిపోయింది.18వ ఓవర్లో మిల్లర్‌ను అవేశ్‌ అవుట్‌ చేయగా… అభినవ్‌ మనోహర్‌ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా… 19వ ఓవర్లో చమీర 9 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో మనోహర్‌ రెండు బౌండరీలు, తెవాటియా ఫోర్‌తో టైటాన్స్‌ విజయం సాధించింది.

Photo Courtesy- HardikPandya/Twitter