Site icon HashtagU Telugu

Ahmedabad Plane Crash: కేవ‌లం 2 నిమిషాల్లోనే క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం!

Dreamliner Plane

Dreamliner Plane

Ahmedabad Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్ప‌కూలిన (Ahmedabad Plane Crash) విష‌యం తెలిసిందే. ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇందులో సిబ్బందితో క‌లిపి మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో సుమారు 100 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం.. ఈ విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 2 నిమిషాలలో అంటే 1:40 గంటలకు కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అనేక వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో విమానం టేకాఫ్ చేసిన కొద్ది సేపటికే విమానం కుప్ప‌కూలిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

స‌రైన కార‌ణం తెలియాల్సి ఉంది

విమానం టెయిల్ భాగం ఓ భ‌వ‌నాన్ని ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం.. విమానం ఇంజన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడిందని కూడా తెలుస్తోంది. దీని వల్ల విమానం దుర్ఘటనకు గురైంది. దుర్ఘటన తర్వాత గాయపడినవారిని సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రస్తుతం మూసివేశారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు సమాచారం తీసుకోవాలని సూచించారు.

Also Read: Air India Plane Crash: కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ

DGCA ప్రకటన

అహ్మదాబాద్ దుర్ఘటనపై DGCA ప్రకటన విడుదల చేసింది. ప్రకటన ప్రకారం.. ఎయిర్ ఇండియా B787 విమానం VT-ANB అహ్మదాబాద్ నుండి గాట్విక్‌కు బయలుదేరింది. ఆ తర్వాత ఇది కుప్ప‌కూలింది. DGCA ప్రకారం ఫ్లైట్‌లో 2 పైలట్లు, 10 క్యాబిన్ క్రూ సభ్యులతో సహా 242 మంది ఉన్నారు. ఈ విమానంలో గుజ‌రాత్ మాజీ సీఎం విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉందో తెలియ‌రాలేదు. ఈ విమానం ఘ‌ట‌న‌లో భారీగా ప్రాణ న‌ష్టం ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

ఏయే దేశస్థులు ఉన్నారు?

అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన‌ బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వ్య‌క్తులు, 1 కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ వ్య‌క్తులు ఉన్నారు.