Agra Mob: ఆగ్రాలో దారుణం.. రెండు ఇళ్లకు నిప్పు!

తాజ్ మహల్ కు నెలవుగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణం జరిగింది.

  • Written By:
  • Updated On - April 16, 2022 / 03:47 PM IST

తాజ్ మహల్ కు నెలవుగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఓ ముస్లిం కుటుంబానికి చెందిన రెండు ఇళ్లకు కొందరు శుక్రవారం నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఈ ఘటనకు కారణం ఏమిటంటే.. ఆగ్రాలో జిమ్ సెంటర్ నడుపుతున్న సాజిద్ అనే యువకుడు .. మరో వర్గానికి చెందిన 22 ఏళ్ల యువతితో కలిసి సోమవారం [ ఏప్రిల్ 11న] అదృశ్యమయ్యాడు. బుధవారం రోజున పోలీసులు యువతి ఆచూకీని గుర్తించి ఆమె ఇంటికి చేర్చారు. కానీ ఇంకా యువకుడు సాజిద్ ఆచూకీ ని గుర్తించలేకపోయారు. ఈనేపధ్యంలో “ధరమ్ జాగరన్ సమన్వయ్ సంఘ్” అనే సంస్థ సభ్యులు శుక్రవారం ఉదయం సాజిద్ కుటుంబానికి చెందిన రెండు ఇళ్లకు నిప్పు పెట్టారు. వెంటనే సాజిద్ ను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు.

స్థానిక మార్కెట్లోని దుకాణాలను కూడా మూసివేయించారు. అయితే ఈదాడి ఘటనలో యువకుడు సాజిద్ కుటుంబ సభ్యులకు ఏమైనా గాయాలయ్యాయా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈఘటన నేపథ్యంలో స్థానిక పోలీస్ పోస్ట్ ఇంచార్జ్ ను ఆగ్రా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సాజిద్ ఇంటికి నిప్పు పెట్టిన వారిపై కేసు నమోదు చేశామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. మరోవైపు సాజిద్ ఆచూకీని గుర్తించాలంటూ అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని కిడ్నాప్ చేసినందుకు సాజిద్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, “నేను మేజర్ ను .. నా వ్యక్తిగత నిర్ణయం మేరకే ఆ యువకుడితో వెళ్ళాను” అని ఆ యువతి చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.