‘Agnipath’ Protests Spread: “అగ్నిపథ్”పై అట్టుడికిన బీహార్, యూపీ, హరియానా.. ఎందుకో తెలుసా?

"అగ్నిపథ్" స్కీం పై బీహార్ అట్టుడికింది. సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఆశావహ అభ్యర్థులు ఆగ్రహంతో ఊగిపోయారు.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 09:50 AM IST

“అగ్నిపథ్” స్కీం పై బీహార్ అట్టుడికింది. సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఆశావహ అభ్యర్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ముజఫర్‌పూర్, బక్సార్, బెగూసరాయ్, భబువా, నవాడ, అర్రా, జహానాబాద్, సహార్స, ఛాప్ర, సరన్, గయ, ముంగర్, సివన్,ఔరంగాబాద్ ల పరిధిలో యువత రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. పలుచోట్ల నిరసన హింసాత్మకంగా మారింది. సరన్ జిల్లాలోని ఛాప్ర రైల్వే స్టేషన్లో ఒక ప్యాసింజర్ ట్రైన్ కు నిరసన కారులు నిప్పు పెట్టారు. ఛాప్ర పట్టణంలోనూ ఒక బస్సు అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. భబువ రోడ్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లోని ఒక కోచ్ ను దహనం చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో బీహార్ నుంచి నడిచే 22 రైళ్లను రద్దు చేశారు. హరియానా, ఉత్తరప్రదేశ్ లోని పలు నగరాల్లోనూ నిరసనలు హింసాత్మకంగా మారినట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో హరియానాలోని పల్వాల్ జిల్లాలో ఏకంగా పోలీసుల వాహనానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో పట్టణంలో ఫోన్ ఇంటర్నెట్, ఎస్ ఎం ఎస్ సర్వీసులను 24 గంటల పాటు నిలిపివేశారు.

స్పందించిన రాహుల్..

“సాయుధ బలగాల శౌర్య పరాక్రమాల విషయంలో కేంద్రం రాజీపడవద్దు. అగ్నిపథ్ స్కీం కు సంబంధించి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ చేశారు. పలువురు రాజకీయ నేతలు, సైనిక మాజీ అధికారులు కూడా కేంద్రం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు సూచనలు కూడా చేస్తున్నారు.

ఏమిటీ అగ్నిపథ్ స్కీమ్?

కొత్త రిక్రూట్‌మెంట్ ప్రణాళిక ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ జీతభత్యాలు, పింఛను బిల్లులను తగ్గించు కోవాలని యోచిస్తోంది. ఇలా మిగిల్చే నిధులను ఆయుధాల సేకరణ కోసం వెచ్చించడమే లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. ఈ పథకం కింద కేంద్రం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21ఏళ్ల మధ్య వయసు కలిగిన దాదాపు 46 వేల మందిని నాలుగేళ్ల సర్వీసుపై ఈ ఏడాది నియమించుకోనుంది. వీరికి సర్వీసు కాలంలో నెలవారీగా రూ. 30వేలు-40వేల మధ్య(ఇతర అలవెన్సులు మినహాయించి) చెల్లించనున్నారు. వీటితోపాటు వైద్య, బీమా సదుపాయాలు కూడా కల్పిస్తారు.అయితే, నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. వీరంతా 15ఏళ్లపాటు నాన్ ఆఫీసర్ ర్యాంకులో సేవలందించే వీలుంటుంది. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే, పెన్షన్ ప్రయోజనాలు మాత్రం ఉండవు.