Agnipath Protest: తెలంగాణలో ‘అగ్నిపథ్’ నిరసన జ్వాలలు.. ఒకరు మృతి!

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 01:14 PM IST

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నిరసనలు తెలంగాణకు పాకాయి. ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పైకి చేరుకుని, రైల్వే స్టేషన్ సమీపంలో బస్సులపై రాళ్లు రువ్వారు. దుకాణాలు, స్టాళ్లను ధ్వంసం చేశారు, ఆందోళనకారులు రైలు బోగీలకు నిప్పు పెట్టారు. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌ను యువత ధ్వంసం చేయడంతో భయాందోళన నెలకొంది. అగ్నిపత్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనలో భాగంగా రాళ్లు రువ్వడం, కోచ్‌లకు నిప్పు పెట్టడం, స్టాల్స్ ధ్వంసం చేయడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం ఊహించని సంఘటనతో అన్ని రైళ్లను నిలిపివేయాలని అధికారులు తెలిపారు. ఔత్సాహిక మిలిటరీ రిక్రూట్‌మెంట్‌లు “మాకు న్యాయం కావాలి” అనే నినాదాలు చేస్తూ ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడం కనిపించింది.  సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

కాల్పుల్లో ఒకరు మృతి

శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌ నిరసనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరపడానికి ముందు, రైల్వే పోలీసులు గుంపును చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేయడమే కాకుండా కాల్పులు జరపాలని హెచ్చరించినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఆందోళనకారుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

ఆర్టీసీ బస్సులకూ నిప్పు

మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. రైల్వేస్టేషన్‌లో లోపలికి చొచ్చుకెళ్లి ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. పట్టాల మధ్యలో నిప్పు పెట్టారు. దీంతో ప్రయాణికులు రైళ్లను వదిలి పరుగులు పెట్టారు. రైళ్లన్నింటినీ నిలిపివేసిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి వెంటనే నియామకప్రక్రియ యథాతథంగా కొనసాగించాలంటూ నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

మోదీపై కేటీఆర్ ట్వీట్

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు దేశంలో ఉన్న నిరుద్యోగతకు నిదర్శనమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శించారు. తొలుత రైతులను ఇబ్బంది పెట్టిన మోదీ సర్కార్‌ ఇప్పుడు సైనికులను గందరగోళ పరుస్తోందని ఆరోపించారు. వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ నుంచి నో ర్యాంక్‌- నో పెన్షన్‌ వరకు తీసుకొచ్చారని కేటీఆర్‌ దుయ్యబట్టారు.