Team India: WTC పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్

ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ రిఫరీ పాయింట్ల కోతతో పాటు జరిమానా విధించాడు.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 09:48 PM IST

ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ రిఫరీ పాయింట్ల కోతతో పాటు జరిమానా విధించాడు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకపోవడంతో 2 కీలక పాయింట్లు కోల్పోవడంతో పాటు 40 శాతం మ్యాచ్ ఫీజులో ఫైన్ పడింది.

ఇంతకముందు నాటింగ్‌హామ్ టెస్టులోనూ, సెంచూరియన్ టెస్టులోనూ భారత్ ఇదే స్లో ఓవర్‌రేట్‌తో పాయింట్లు కోల్పోయింది. ఇప్పటి వరకూ ఐదు పాయింట్లు కోల్పోయిన భారత్ ఇంగ్లాండ్‌తో తాజా ఓటమి తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 52.08 విన్నింగ్ పర్సంటేజీతో నాలుగో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మూడో స్థానంలోనూ, సౌతాఫ్రికా రెండో స్థానంలోనూ కొనసాగుతున్నాయి.

ఇక ఆస్ట్రేలియా 84 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 4 సిరీస్‌లలో 12 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఆరు విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌లలో పరాజయం పాలై 2 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ తాను ఆడబోయే బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు సిరీస్‌లలో మొత్తం 6 మ్యాచ్‌లు గెలిస్తే భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖరారైనట్టే. ఒకటిరెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం సౌతాఫ్రికాతో కలిసి ఫైనల్ బెర్త్ రేసులో ఉంటుంది. అప్పుడు విన్నింగ్ పర్సంటేజీ ఆధారంగా ఫైనల్ చేరబోయే జట్టును నిర్ణయిస్తారు.