AP TDP: తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీఈసీకి లేఖ రాశారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటివేసిందని, ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం అప్పులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారని ఆరోపించారు.
చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆర్.బి.ఐ ప్రకటన ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల అప్పులకు ధరఖాస్తు చేసిందని ఆయన అన్నారు. ముందు బిల్లులు ముందే చెల్లించాలన్న సిఎఫ్ఎంఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పుడు తెస్తున్న రూ.4 వేల కోట్లు అప్పులు సైతం కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారని చెప్పారు.
జూన్ 4, 2024 న ఎన్నికల ఫలితాల రానున్న నేపద్యంలో అధికారం కోల్పోతున్న ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు, చెల్లింపులు చేయకుండా అడ్డుకోవాలని కోరారు.