Site icon HashtagU Telugu

IPL2022: RCB ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

Rcb Ipl

Rcb Ipl

ఐపీఎల్ 15వ సీజన్‌ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ జట్టుకు మెంటార్‌గా ఏబీ డీవిలియర్స్‌ను నియమించబోతోంది. దీనిపై ఇప్పటికే ఏబీతో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై డివీలియర్స్ కూడా సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన చేసే అవకాశముంది. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన ఏబీ డివీలియర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.

క్రికెట్‌లో అన్ని రకాల షాట్లు కొట్టగలిగే ఆటగాడిగా గుర్తింపు ఉన్న ఏబీని ఫ్యాన్స్ మిస్టర్ 360 అని ముద్దుగా పిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే గత సీజన్ తర్వాత ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికి అందరికీ షాకిచ్చాడు.

ఐపీఎల్ ద్వారా భారత్‌లోనూ ఏబీకి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా కోహ్లీతో కలిసి డివీలియర్స్ పలు కీలక ఇన్నింగ్స్‌లతో అలరించాడు. దాదాపు ప్రతీ సీజన్‌లోనూ నిలకడగా రాణించిన డివీలియర్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పినా.. మెంటార్‌గా అతని సేవలు వినియోగించుకోవాలని ఆర్‌సీబీ నిర్ణయించింది. డివీలియర్స్‌ లాంటి ఆటగాడు మెంటార్‌గా ఉండడం తమ జట్టు ఆటగాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఆ ఫ్రాంచైజీ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. అటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ. ఇటు ఐపీఎల్‌లోనూ అపార అనుభవం కలిగిన ఏబీ జట్టులోని యువఆటగాళ్ళకు చక్కని మార్గనిర్ధేశకునిగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే గత సీజన్‌లో డివీలియర్స్‌.. 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ 184 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 5162 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.