BJP Party: తెలంగాణ బిజెపిలో జరుగుతున్న నియంత పోకడకు నిరసనగా బిజెపి సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆవునూరి రమాకాంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించారు.
‘‘సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు చేసిన త్యాగాలను గుర్తించకుండా స్థానిక కార్యకర్తలతో సంప్రదించకుండా ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమ రెడ్డి గారిని సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా ప్రకటించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. పైకి కనపడే భారతీయ జనతా పార్టీ వేరు అంతర్గతంగా భారతీయ జనతా పార్టీలో జరిగే పరిణామాలు వేరు. సిద్ధాంతాలు గల పార్టీగా నిబద్ధత కలిగిన నాయకులుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చని ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది’’ ఆయన అన్నారు.
‘‘పార్టీలో చేరిన మొదటి రోజు నుండి నా చెమట చుక్కలు పెట్టుబడిగా పెట్టి ప్రాణాతి ప్రాణంగా భావించే 25 సంవత్సరాల నా వృత్తిని కూడా వదులుకొని, కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నిబద్ధత కలిగిన నాయకునిగా పార్టీ ఎదుగుదలకు ఎంతో పోరాటం చేయడం జరిగింది. కానీ రాజకీయాలలో నమ్మకమే ప్రధాన పెట్టుబడి అని బలంగా నమ్మే వ్యక్తిని నేను అందుకే బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మి కష్టపడడం జరిగింది. కానీ నా నమ్మకాన్ని వమ్ముచేస్తూ కష్టపడ్డ వ్యక్తుల యొక్క కష్టాన్ని గుర్తించకపోగా నియంతృత్వ పోకడలతో, ఒంటెద్దు నిర్ణయాలతో మా యొక్క మనోభావాలను గౌరవించకుండా ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన లేని ఈ ప్రాంత ఉద్యమం మీద పట్టు లేని ఒక పసలేని వ్యక్తిని తీసుకువచ్చి మా మీద బలవంతంగా రుద్దడం అనేది సిగ్గుచేటు’’ అని అన్నారు.
‘‘పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఎంతోమంది జాతీయ, రాష్ట్ర నాయకులు బీజేపీ లోకి రావడం జరిగింది కానీ బీజేపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఇమడలేక వెనుదిరిగిన నాయకులు ఎందరో అందుకు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారి సంఘటనే నిదర్శనం. ఈ సందర్భంగా కింది స్థాయి కార్యకర్తలు బీజేపీ పార్టీ పై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకండని విన్నవిస్తూ, నా మీద నమ్మకం తో ఇంతకాలం నావెన్నంటి ఉన్న కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరునా ధన్యవాదాలు’’ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.