Kishan Reddy: కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక : కిషన్ రెడ్డి

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 12:43 AM IST

Kishan Reddy: దేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం స్వర్ణయుగం వంటిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  వ్యవసాయం నుంచి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతి వృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకూ రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు.  అలాంటి కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక అని కొనియాడారు. తాజాగా, పునఃనిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.1324 – 25లో తుగ్లక్ సైన్యం దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసం అయ్యిందని.. సూర్య, వాసుదేవ విగ్రహాలను సైతం తుగ్లక్ సైన్యం తీసుకెళ్లిందని కిషన్ రెడ్డి అన్నారు.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం వేయి స్తంభాల గుడిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. ఆలయంలో పునఃనిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో శాంతి హోమం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏఎస్ఐ అధికారులు తమ పరిధి, పరిమితుల మేరకే పని చేస్తారని.. వీటి కారణంగా నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని అన్నారు.

‘మధ్యయుగం కాలంనాటి ఈ గుడి.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకత చాటుకుంది. కల్యాణ మండపం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు 2006లో కూల్చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాను. 2006 నుంచి దీని పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనా అది నత్తనడకన సాగింది. వెయ్యి స్తంభాల మండపం పునరుద్ధరణ ఓ ఛాలెంజింగ్ టాస్క్.’ అని పేర్కొన్నారు.