Nalgonda: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 11:05 PM IST

Nalgonda: మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రికి గత రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వ్యాపారి వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. ఇటీవల అధిక శాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నెల రోజుల క్రితం రూ.లక్ష ఇవ్వగా.. 4 రోజుల క్రితం మరో రూ.3 లక్షలు డిమాండే చేశారని చెప్పారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే టెండర్లు పిలిచి బయటి వారికి ఇస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. డబ్బులు కట్టలేక ఏసీబీ డీఎస్పీని సంప్రదించగా.. వారి సూచన మేరకు శుక్రవారం ఉదయం సూపరింటెండెంట్ కు డబ్బులు ఇచ్చానని చెప్పారు.