Eel Fish Secret: ‘చేపపొట్ట’లో రహస్యం!

మార్కెట్ కి వెళ్లి, కాస్త కంటికి ఇంపుగా కనబడ్డ చేపని బేరమాడో... ఆడకుండానే కొనెయ్యడం, టకటకా కట్ చెయ్యించి ఇంటికి తెచ్చుకోవడం. ఇగురో... పులుసో... వేపుడో... చేసుకుని తినెయ్యడం  ఇదే మనం చేసేపని.

  • Written By:
  • Updated On - February 16, 2022 / 09:27 PM IST

Story by: చిరంజీవి వర్మ

మార్కెట్ కి వెళ్లి, కాస్త కంటికి ఇంపుగా కనబడ్డ చేపని బేరమాడో… ఆడకుండానే కొనెయ్యడం, టకటకా కట్ చెయ్యించి ఇంటికి తెచ్చుకోవడం. ఇగురో… పులుసో… వేపుడో… చేసుకుని తినెయ్యడం  ఇదే మనం చేసేపని. కాస్త ఆసక్తి ఉన్నవాళ్ళైతే అది పులసా? పండుగప్పా? సందువానా? వంజరమా? బొచ్చా? బొమ్మిడాయా? అన్న పేరు తెలుసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు. ఇంకా  అయితే  అది సముద్రంచేపా? నది చేపా? చెరువుచేపా? కాలువచేపా? అని ఎంక్వైరీ చేసే వాళ్లు ఉంటే ఉండొచ్చు.

మనం కొన్న చేప ఎంత బరువుంది? ఎన్ని ముక్కలు తెగింది? ముక్కలు చూడ చక్కగా వున్నాయా లేదా? ఇదే చూస్తాం. వాటి వ్యర్ధాల గురించి అసలు పట్టించుకోము. అంత తీరిక కూడా మనకి ఉండదు. కానీ కొన్ని చేపల కంటే వాటి వ్యర్ధాలే  ఎక్కువ ఖరీదు చేస్తాయంటే నమ్మశక్యం కాదు, కానీ నమ్మక తప్పదు. తూర్పుతీరంలో విరివిగా దొరికే ఈల్ (Eel) చేపల గురించి కాసేపు ముచ్చటించుకుందాం. వీటిని స్థానికంగా పాములు అని, సముద్రపు బొమ్మిడాయలు అని పిలుస్తుంటారు. బంగాళాఖాతంలో  మత్యకారుల వలలకి గుంపులు గుంపులుగా తిరిగే ఇవి చిక్కుతుంటాయి. చాలా రుచికరంగా రెండు కిలోల నుంచి పది కిలోల వరకూ ఆ పై కూడా బరువు  ఉండే ఈ చేపలు కేజీ నూట యాభై వరకూ ధర పలుకుతాయి. ఈ చేపలు వలకి చిక్కితే మత్యకారుల పంట పండినట్టే. మామూలుగా వేటముగించుకొని వచ్చిన మత్యకారులు తమ వలలో చిక్కిన ఛేపలని ఫిషింగ్ హార్బర్స్ లో, చిన్న చిన్న రేవుల్లో వేలానికి పెడతారు. కానీ ఈ సముద్రపు బొమ్మిడాయలని వాళ్ళు కోసి శుభ్రం చేయిస్తారు. ఆ వ్యర్ధాల్లో తమకి కావలసిన దాన్ని తీసుకున్న తరవాత మాత్రమే వీటిని విక్రయిస్తారు. అలా ‘ఈల్’ చేప పొట్టనుంచి సేకరించే… పొడవుగా గాలితిత్తిలాగా ఉండే అవయవాన్ని ‘తూత’ అని,  ‘నట్’  అనీ వ్యవహరిస్తుంటారు.

ఇలాంటి గాలితిత్తులు అన్నిరకాల చేపల్లోనూ ఉంటాయి. కానీ eel చేపలో ఉండే ఈ గాలితిత్తి చాలా ప్రత్యేకమయింది. దానికి అంతా ఇంతా డిమాండ్ కాదు. దీన్ని అలాగే పచ్చిగానూ ఎండబెట్టి కూడా అమ్ముతారు. అడుగు వరకూ పొడవుండే ఈ పచ్చి ‘తూత’లు కేజీకి పది వరకూ తూగుతాయి. వందగ్రాముల తూతని ఆరు వేల రూపాయలకి యార్డుల్లో రడీగా ఉండే ఏజంట్లు కళ్ళకద్దుకుని ఎగరేసుకు పోతారు. ఎండబెట్టినవి అయితే కిలో నలభై వేల వరకూ అమ్ముతారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు, రెండు వేలు పలికే పది కేజీల సముద్రపు బొమ్మిడాయి పొట్టలో ఆరువేలు పలికే వందగ్రాముల ‘తూత ‘ ఎంత విలువైందో. తూతకి ఎందుకింత ధర? అసలు దీన్ని కొంటున్న వాళ్ళు ఎవరు? వాళ్లు దీన్ని ఎక్కడకి తరలిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారన్నది పెద్ద బ్రహ్మరహస్యం. ఎవరికి వాళ్ళు ఆ కొనేవాళ్ళు ఫార్మా కంపెనీల బ్రోకర్లని, ఈ తూతతో సర్జరీ  స్టిచ్చెస్  వేసే దారం తయారు చేస్తారని, కాదు కాదు ‘వయాగ్రా’ తరహా మందుల్లో వాడతారని ఎవరికి తోచిందీ, నచ్చిందీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

స్థానిక మత్యకారుడు పెమ్మాడి నరసింహ hashtagu తో మాట్లాడుతూ “నా చిన్నప్పుడు మా తాత ఈ తూతలని అమ్మడం చూసా. ఇప్పుడు నా మనవడుకూడా వేటకి వెళ్ళొచ్చి  ఈ తూతల్ని అమ్ముతున్నాడు. ఇప్పటివరకూ ఈ తూతల్ని వాళ్లు ఎక్కడకి పట్టుకుపోతారో… అన్నది మాకు తెలీదు.  అడిగినా నవ్వి ఊరుకుంటారు తప్ప చెప్పరు. వాళ్ళూ వీళ్ళూ అనేదాన్ని బట్టి ఏవో మందులు తయారు చేస్తారని, అది మాత్రమే మాకు  తెలుసు” అన్నాడు. అసలు ఏమిటీ చేపపొట్టలోని రహస్యం? స్థానిక మార్కెట్లోనే… కనీ వినీ ఎరగని ధర పలికే ఈ తూతలు ఇంకా ఎన్ని చేతులు మారతాయో? ఎన్ని రెట్ల సొమ్ముకి అమ్ముడు పోతాయో అన్న సందేహం వస్తోంది  కదా?  దళారీలు చేపలు కాదు కద,  అమాయకంగా వచ్చి వలల్లో పడ్డానికి, తమ ఇంటిగుట్టు విప్పి చెప్పడానికి.