Ukraine: ఐరాసలో కీలక తీర్మానం… భారత్ మద్దతు కోరిన ఉక్రెయిన్!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఏడాది కావస్తున్న రెండు దేశ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదరటం లేదు.

  • Written By:
  • Publish Date - February 22, 2023 / 08:02 PM IST

Ukraine: ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఏడాది కావస్తున్న రెండు దేశ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదరటం లేదు. పైగా రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఏనుగుతో పిల్లి పోట్లాడినట్లుగా ఇరు దేశాల మధ్య యుద్ధం ఉంది. కానీ పిల్లి ఎక్కడా తగ్గటం లేదు. ఏనుగు లాంటి రాష్యాతో గట్టిగా గర్జించి ఎదురిస్తోంది. పాశ్చాత్య దేశాల మద్దతుతో దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్, సాధ్యమైనంత త్వరగా యుద్ధం ముగించాలని భావిస్తోంది. కానీ అది సాధ్యపడటం లేదు. దీంతో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు మరో ఎత్తుగడకు ఉక్రెయిన్ సిద్ధమైంది.

ఐరాసను ఉక్రెయిన్ వేదికగా మార్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. అంతర్జాతీయ సమాజం ముందు రష్యా దుశ్చర్యను ఎండగట్టి, ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందుకోసం ఐరాసలో శాంతి ఒప్పందం ప్రవేశపెట్టనుంది. ఈ శాంతి తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా భారతదేశాన్ని ఉక్రెయిన్ కోరింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు డైరెక్ట్‌గా ఫోన్ చేసింది. తమ తీర్మానానికి భారత్ మద్దతివ్వాలని కోరింది. రష్యా నుంచి తాము శాంతిని తప్ప మరేమీ కోరుకోవడం లేదని ధోవల్‌కు ఉక్రెయిన్ ప్రతినిధి స్పష్టం చేశారు. రష్యా భూభాగం తమకు అక్కర్లేదని, ఒక్క సెంటును కూడా కోరుకోవటం లేదన్నారు.తమ భూభాగం కోసమే పోరాడుతున్నట్లు ఆయన స్పష్టంగా వెల్లడించారు.

మరోవైపు తమకు చిరకాల మిత్రదేశమైన రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ప్రవేశపెట్టే తీర్మానాలకు మద్దతిచ్చే విషయంలో భారత్ తటస్ధంగా వ్యవహరిస్తోంది. అలాగని యుద్ధం ఆపేలా రష్యాపైనా తగిన ఒత్తిడి తీసుకురాలేకపోతోంది. దీనికి అనేక కారణాలు ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అయినా ఉక్రెయిన్ ప్రవేశపెట్టే తీర్మానానికి భారత్ మద్దతిస్తుందన్న గ్యారంటీ లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే రష్యాతో భారత్‌కు అనేక రకాలు సంబంధాలు ఉన్నాయి.