Importance of Tithi : మన హిందూ కాలగణన ప్రకారం ప్రతి నెలా రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. శుక్లపక్షం (పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) మరియు కృష్ణపక్షం (పాడ్యమి నుంచి అమావాస్య వరకు). రెండూ కలిపి ఒక నెలలో 30 తిథులు ఉంటాయి. ఈ తిథుల్లో ఏది శుభం? ఏది పనుల కోసం తగినది? అందుకే ప్రతీ తిథి విశిష్టతను తెలుసుకోవాలి.
పాడ్యమి తిథి: ఈ తిథి రెండు భాగాలుగా పరిగణించబడుతుంది. మొదటి సగం (ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు) శుభకరంగా ఉండదు. కానీ రెండో సగం (మధ్యాహ్నం తర్వాత) శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవచ్చు.
విదియ, తదియ (2వ, 3వ తిథులు): ఇవి మంచి తిథులుగా పరిగణించబడతాయి. ఈ తిథుల్లో కుటుంబ కార్యక్రమాలు, వ్యాపార ప్రణాళికలు మొదలుపెట్టడం శుభం.
చవితి (4వ తిథి): చవితి తిథి కూడా శుభతిథే అయినా, పాడ్యమిలా ఇందులోనూ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎక్కువగా అనుకూలం.
పంచమి (5వ తిథి): పంచమి తిథిలో ఏ పని చేసినా కలిసొస్తుంది. విద్య, వ్యాపార, గృహనిర్మాణ కార్యక్రమాలకు ఇది ఉత్తమం.
షష్టి (6వ తిథి): ఈ తిథి ప్రారంభాలకు అనుకూలం కాదు. మౌనం పాటించి, ఆధ్యాత్మిక కార్యాలపై దృష్టి పెట్టడం మంచిది.
సప్తమి (7వ తిథి): విద్యాభ్యాసం, పరీక్షలు, విద్యా సంబంధిత విషయాలకు ఇది శుభతిథి.
అష్టమి (8వ తిథి): ఈ తిథి అష్టకష్టాల తిథిగా పరిగణించబడుతుంది. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
నవమి (9వ తిథి): నవమి తిథి కూడా అంతే. రాముడు నవమి రోజే జన్మించాడన్నా, ఆయన జీవితం ఇబ్బందుల మధ్యే సాగింది. ఈ తిథిలో పనులు ప్రారంభించడం అనుకూలం కాదు.
దశమి (10వ తిథి): ఇది విజయదశమి తిథిగా ప్రసిద్ధి. ఈ రోజున ఏ పని చేసినా విజయం సాధించగలరు.
ఏకాదశి (11వ తిథి): ధర్మారాధనలు, ఉపవాసాలు, దానాలు చేసే వారికి ఇది ఎంతో శుభదాయకం. కానీ నిత్య కార్యాల్లో విజయఫలితం తక్కువగా ఉంటుంది – పది పనులు ప్రారంభిస్తే ఒక్కటి మాత్రమే పూర్తవుతుందన్న నమ్మకం ఉంది.
ద్వాదశి (12వ తిథి): ఈ తిథి ప్రయాణాలకు అనుకూలం. కొత్త ప్రదేశాలు దర్శించేందుకు ఇది శుభం.
త్రయోదశి (13వ తిథి): విజయాన్ని ప్రసాదించే తిథి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు ప్రారంభించవచ్చు.
చతుర్దశి (14వ తిథి): ఈ తిథిలో ఏ పనీ కలసిరాదు. మానసిక స్థైర్యం అవసరమవుతుంది. ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టడం ఉత్తమం.
పౌర్ణమి (పూర్తి చంద్రుడు ఉండే రోజు): ఈ రోజు అన్నింటికీ శుభదాయకం. పూజలు, కుటుంబ సమావేశాలు, మంగళకార్యాలు జరపవచ్చు.
అమావాస్య (చంద్రుడు కనిపించని రోజు): కొత్తగా ఏ పనీ ప్రారంభించకపోవడం మంచిది. త్యాగాలు, పితృ కార్యాలు చేయడానికి అనుకూలం.
తారాబలం కూడా కీలకం
తిథి బలం తోపాటు తారాబలం కూడా కీలకంగా పరిగణించబడుతుంది. కొన్ని తిథులు శుభకరంగా ఉండకపోయినా, తారాబలం బలంగా ఉంటే కార్యప్రారంభం చేయవచ్చు. అందుకే, పూర్తిగా తిథి మీద ఆధారపడకుండా పంచాంగ విశ్లేషణకు ప్రాముఖ్యత ఇవ్వాలి.
Read Also: Ash Gourd : బూడిద గుమ్మడికాయ..దిష్టికే కాదు..సర్వరోగ నివారిణి !