Site icon HashtagU Telugu

Syria: చావు అంచుల్లో ప్రాణం పోసుకున్న పాప.. దత్తత తీసుకోవడానికి వేల మంది పోటీ!

Earthquake Turkey Pb 1675992351

Earthquake Turkey Pb 1675992351

Syria: ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. అయితే ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా టర్కీ మరియు సిరియాలో భారీ భూకంపాలు ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. వరుస భూకంపాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల్లో దాదాపు 21వేల మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

అయితే సిరియాలో మాత్రం ఈ భూకంపం విషాదంలో కూడా ఓ అద్భుతం జరిగింది. భూకంపం వల్ల ఓ భవనం కూలిపోయగా.. ఆ భవనం శిథిలాల కింద ఓ బిడ్డ ప్రాణం పోసుకుంది. భవనాల కింద ఎంతోమంది ప్రాణాల కోసం పోరాడుతున్న తరుణంలో ఓ చిన్నారి తల్లి కడుపులో నుండి భూమి మీదకు అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ పాప ప్రపంచంలో ఓ అద్భుతంగా మారింది.

సిరియాలోని జిండిరెస్ భవనం, కుటుంబంతో ఓ నిండు గర్భిణి చిక్కుకుంది. భూకంప ధాటికి ఆమెకు పురుటినొప్పులు వచ్చాయి. భూకంపం వల్ల చావు ఎప్పుడు వస్తుందో తెలియని తరుణంలో.. చావు అంచుల్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత చనిపోయింది. కాసేపటికి బొడ్డుతాడులో ఉన్న పసికందును సహాయ బృందాలు గుర్తించి.. ఆ బిడ్డను రక్షించింది.

చికిత్స కోసం ఆ పాపను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆ పాప గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. దీంతో ఓ వైద్యుడి భార్య ఆ పాపకు పాలు పట్టించి మానవత్వాన్ని చాటింది. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఆ పాపకు ‘అయా’ అనే పేరు పెట్టారు. అయా అంటే అద్భుతం అని అర్థం. భూకంపం లాంటి విపరీత పరిస్థితుల్లో బిడ్డ పుట్టడాన్ని అద్భుతంగా భావించి ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.