Site icon HashtagU Telugu

Madhya Pradesh: వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..

Chinnary

Chinnary

ఓ మూడు నెలల పసికందు (3 Months Old Child) మూఢనమ్మకానికి బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి వాతపెట్టారు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షాదోల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

షాదోల్‌లోని సింగ్‌పుర్‌ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా (pneumonia) బారినపడింది. దీంతో పాపకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఆమె తల్లిదండ్రులు మూఢనమ్మకంతో ఆసుపత్రికి తీసుకెళ్లకుండా స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డు (Iron Rod)తో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అప్పుడు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 15 రోజులు గడిచిపోయింది.

సరైన సమయంలో నిమోనియా (Pneumonia)కు చికిత్స అందకపోవడంతో ఇన్ఫెక్షన్‌ (Infection) వ్యాపించి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పాపకు హడావుడిగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఖననం చేసిన పాప మృతదేహాన్ని వెలికి తీసి శనివారం పోస్టుమార్టం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఘటనపై షాదోల్‌ జిల్లా కలెక్టర్‌ వందన వేధ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘వాతలు పెట్టొద్దని స్థానిక అంగన్వాడీ కార్యకర్త చెప్పినా ఆ పాప తల్లి పట్టించుకోలేదు. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిమోనియాకు ఇలాంటి ‘చికిత్స’లు సర్వసాధారణమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భాజపా నేతలు.. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ను కోరారు.

Also Read:  Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ

Exit mobile version