Site icon HashtagU Telugu

99 Yr Old: 99 ఏళ్ల వయసులో నడక పోటీలో యాదగిరి విజయం.. ఏం తింటారంటే..!

Old

Old

సాధించాలన్న కసి ఉండాలనే కాని ఎందులో అయినా విజయం సొంతం చేసుకోవచ్చు. తెలంగాణకు చెందిన 99 ఏళ్ల యాదగిరిని చూస్తే అర్థమవుతుంది. ఈయనను వృద్ధుడు అనలేం. ఎందుకంటే.. వయసులో అంకెల ప్రకారమే అయితే ఆయన వృద్ధుడు. కానీ మనసులో మాత్రం పదహారేళ్ల పడుచుపిల్లాడే. అంటే అంతటి మానసిక శక్తి ఆయన సొంతం. అందుకే ఈ వయసులో కూడా నడక పోటీలో పాల్గొని విజయం సాధించాడు.

సికింద్రాబాద్ రైల్ నిలయం ఆర్.ఆర్.సి. గ్రౌండ్ లో ఆరోగ్యవంతులైన సీనియర్ సిటిజన్లకు నడక పోటీలు పెట్టారు. ఇలాంటివాటికి స్పందన చాలా తక్కువగా ఉంటుంది. పైగా చూసేవాళ్లు కూడా తక్కువే. అయినా సరే.. 99 ఏళ్ల యాదగిరి.. ఆ పోటీలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు. ఆయన చూడడానికే వచ్చాడులే అని అక్కడివారు అనుకున్నారు. కానీ ఆయన పోటీలో పాల్గొంటానని చెప్పడం, తన వయసు 99 ఏళ్లని చెప్పడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు.

ఈ నడక పందెం కూడా తక్కువ దూరమేమీ కాదు. 3 వేల మీటర్ల నడక పోటీ ఇది. అయినా సరే యాదగిరి వెనక్కు తగ్గలేదు. చకచకమని.. వడివడిగా అడుగులేశాడు. అందరినీ దాటుకుంటూ వెళ్లి ఫస్ట్ ప్లేస్ లో నిల్చున్నాడీ తాత. ఫస్ట్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. ఆయన నడక వేగాన్నీ, ఆయన ఉత్సాహాన్నీ చూసిన అక్కడివారు ఫిదా అయ్యారు. యూత్ అయితే.. తాతగారు.. మీరు ఈ వయసులోనూ ఇలా ఉన్నారంటే గ్రేట్ అని మెచ్చుకున్నారు.

యాదగిరి తాత మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని అడిగితే.. ఆయన చెప్పేది ఒకే ఒక్క మాట. అది.. శారీరక శ్రమ అనే. నల్లగొండ జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల కిందటే భార్య చనిపోయింది. దీంతో ఉప్పల్ లో ఉంటున్న తన కుమారుడి వద్దే ఉంటున్నారు. రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం తినే యాదగిరికి బీపీ, షుగర్ వంటి ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవు. ఎలాంటి దురలవాట్లూ లేవు. రాజకీయ నాయకుల్లో చంద్రబాబునాయుడిని ఇష్టపడే యాదగిరికి నడకంటే ప్రాణం. అందుకే ఎంత దూరమైన సరే.. నడిచే వెళతారు. అదే ఆయన హెల్త్ సీక్రెట్.