Site icon HashtagU Telugu

Biparjoy Effect: ముంచుకొస్తున్న బిఫర్ జాయ్ తుఫాన్.. ఏకంగా 67 రైళ్లు రద్దు?

Biparjoy Effect

Biparjoy Effect

తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్ర రూపం ధరించి తీరం వైపు ముంచుకొస్తోంది. గుజరాత్‌ లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. దాంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు ముందస్తు సహాయక చర్యలు మొదలు పెట్టాయి. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కచ్‌, ద్వారక ప్రాంతాల్లో దాదాపు 12వేల మందిని మరో చోటుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జూన్‌ 15 వరకు గుజరాత్‌ లో విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. అయితే తుపాను ఎఫెక్ట్‌తో పశ్చిమ రైల్వే పరిధిలో వందకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటివరకు 67 రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరో 56 రైళ్ల ప్రయాణాన్ని కుదించారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అటు ముంబై ఎయిర్‌ పోర్టులో విమానాల రాకపోకలకు కూడా ఆటంకం వాటిల్లుతోంది. అటు కాండ్లా పోర్టులో షిప్పింగ్‌ కార్యకలాపాలను నిలిపివేశారు. అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బిపోర్‌జాయ్‌ తుపాను ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తుందో అనే ముందే ఊహించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మరొకవైపు ఈ బిఫోర్ జాయ్ తుఫాన్ ముంచుకొస్తోంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు..