Site icon HashtagU Telugu

Nikhat Zareen: బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు 600 గజాల ఇంటిస్థలం!

Nikhat And Cm Kcr

Nikhat And Cm Kcr

నిజామాబాద్ కమ్ భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పైన తెలంగాణా ప్రభుత్వం కానుకల వర్షం కురిపిస్తూనే ఉంది. కొద్దిమాసాల క్రితం 2కోట్ల రూపాయలు నజరానాగా ఇచ్చిన ప్రభుత్వం తాజాగా జూబ్లీ హిల్స్ లో 600 గజాల ఇంటిస్థలం కేటాయించింది. అంతర్జాతీయస్థాయిలో తెలంగాణా రాష్ట్ర్రానికి, భారత దేశానికి తన అపురూప విజయాలతో ఖ్యాతి తెచ్చిన మేడిన్ నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణా ప్రభుత్వం కానుకలు, బహుమానాలు, నజరానాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ బాక్సింగ్‌ టైటిల్ గెలిచినందుకు ప్రోత్సాహకంగా 600 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ కు తెలంగాణా క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ 600 గజాల ఇంటిస్థలం కేటాయించిన పత్రాలను అందచేశారు

టర్కీ వేదికగా ముగిసిన ప్రపంచ బాక్సింగ్ పోటీలతో పాటు బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు బంగారు పతకాలు అందించడం ద్వారా నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ లోకి తారాజువ్వలా దూసుకొచ్చింది. కుటుంబసభ్యుల ప్రోత్సాహం,ప్రభుత్వం ఆర్థిక సాయం, శిక్షకుల మార్గదర్శనం నడుమ గత రెండేళ్లుగా నిఖత్ జరీన్ పడిన కష్టానికి , ఆమె కుటుంబం త్యాగానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గిన తొలి తెలుగు మహిళగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది.