Site icon HashtagU Telugu

Maoist : ఏపీలో మావోల‌కు ఎదురుదెబ్బ … పోలీసుల ముందు లొంగిపోయిన‌..?

maoist

maoist

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఏపీ పోలీసులు రాష్ట్ర పోలీసులు మావోయిస్టు అగ్రనేత వంత‌ల రామ‌కృష్ణ‌ను అరెస్ట్ చేశారు. దీంతో 60 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట‌ లొంగిపోయారు. పెద్దేబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి (ఏసీఎస్) రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ గొడ్డలి రాయుడుగా మావోయిస్టు పార్టీలో ప‌ని చేస్తున్నాడు. తమ నాయకుడి అరెస్టు తర్వాత కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 33 మంది పార్టీ సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.అగ్ర‌నేత రామ‌కృష్ణ వద్ద నుంచి రూ.39 లక్షల నగదు, 5 కిలోల బరువున్న మందుపాతర, ఐదు డిటోనేటర్లు, 9 రౌండ్ల 9 ఎంఎం పిస్టల్, మావోయిస్టు పార్టీ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కారణంగా లొంగిపోతున్న మావోయిస్టుల స్థావరాలు బలహీనపడుతున్నాయని డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి తెలిపారు. తిరుగుబాటుదారుల కాలం చెల్లిన భావజాలంతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.

మావోయిస్ట్ కార్యకర్తలందరూ లొంగిపోవాలని.. సాధారణ జీవితాన్ని గడపడానికి జ‌న‌జీవ‌న‌ స్రవంతిలో చేరాలని ఆయ‌న కోరారు. రామకృష్ణ అరెస్ట్‌తో మావోయిస్టు పార్టీకి ఏఓబీ ప్రాంతంలో నాయకుడు లేకుండా పోయింది. గతేడాది జూన్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమైన తర్వాత ఈ ప్రాంతంలో మిగిలిపోయిన చివరి ఇద్దరు నాయకులలో రామకృష్ణ ఒక‌రు. ఆదివాసీ, గిరిజనేతర మావోయిస్టు నేతల మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో ఏఓబీ ప్రాంతానికి చెందిన పలువురు కీలక నేతలు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. మరో కీలకనేత కోరా నాగేశ్వరరావు అలియాస్ నగేష్ గత నెలలో అరెస్టయ్యారు