Flamingoes Killed: ముంబైలోని ఘాట్‌కోపర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న సోమవారం ఎమిరేట్స్‌కు చెందిన విమానం ఢీకొనడంతో దాదాపు 40 ఫ్లెమింగోలు మృత్యువాత పడ్డాయి. అయితే దుబాయ్ నుంచి వస్తున్న ఈకే 508 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన ముంబైలోని పంత్‌నగర్‌లోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో విమానాన్ని నిలిపివేసినందున అర్థరాత్రి దుబాయ్‌కు వెళ్లాల్సిన తిరుగు ప్రయాణం రద్దు చేయబడింది.దీంతో పలువురు ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. కాగా ఎమిరేట్స్ విమానం 509 దుబాయ్‌కి మంగళవారం రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణీకులకు విమానయాన సంస్థ వసతి కల్పించింది.
ఘటనపై మహారాష్ట్ర అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదంలో చనిపోయిన ఫ్లెమింగోలు నుండి అధికారులు నమూనాలను సేకరించారు. అటవీ శాఖకు చెందిన మరో బృందం ఎమిరేట్స్ విమానాన్ని నడుపుతున్న పైలట్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తుంది. మా బృందం రంగంలోకి దిగిందని, ఫ్లెమింగోల మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని, పైలట్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తామని అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఎస్వీ రామారావు తెలిపారు. అయితే ఇదివరకు ఈ విమానాశ్రయం చుట్టుపక్కల ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని రామారావు అన్నారు.
ఫ్లెమింగోల గుంపు థానే ఫ్లెమింగో అభయారణ్యం వైపు ఎగురుతున్న సమయంలో విమానం ఢీకొట్టిందని భావిస్తున్నారు. నిర్మాణం లేదా కాలుష్యం కారణంగా ఫ్లెమింగోలు ఇటువైపుగా వచ్చాయని స్థానికులు అంటున్నారు.
Also Read: Kiara Advani : అలాంటి సినిమాలే చేస్తా అంటున్న కియారా.. ఆ రెండు సినిమాలతో టాప్ లేపేస్తుందా..?