Site icon HashtagU Telugu

Road Mishap:మంగ‌ళ‌గిరి వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం.. అదుపుత‌ప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు

Road Accident Imresizer

Road Accident Imresizer

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని యర్రబాలెం వద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. నలుగురు స్నేహితులు క‌లిసి కారులో వెళ్తుండ‌గా కారు అదుపుత‌ప్పి ప‌క్క‌నే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు యువ‌కులు కార్పెంటర్ వాకా శ్రీనివాసరావు(34), డాక్యుమెంట్ రైటర్ తేజ్ రామ్ జీ(25), అతడి అసిస్టెంట్ కొల్లూరు సాయి(25), ఏసీ మెకానిక్ పవన్ కుమార్(26) లు గ‌ల్లంతైయ్యారు.. వీరు తుళ్లూరు వైపు వెళ్తుండగా యర్రబాలెం యర్రచెరువు వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

కారు అద్దాలు తెరుచుకోవడంతో నీరు లోపలికి ప్రవేశించి నలుగురూ మృతి చెందారు. తుళ్లూరు నుంచి వస్తున్న వాహనాలు దీన్ని గమనించి ఆ మార్గంలో వస్తున్న లారీని ఆపి తాడు సహాయంతో కారును బయటకు తీశారు. 108 సిబ్బంది నలుగురిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. వారు ఇంటికి చేరుకోవడానికి ఐదు నిమిషాల ముందు ప్రమాదం జరిగినట్లు స్థానికులు,కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. తేజ్‌రామ్‌జీ తన భార్య మహేశ్వరికి ఫోన్ చేసి 5 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పాడని… కాసేపటికి భర్త రాకపోవడంతో మహేశ్వరి మళ్లీ రాంజీకి ఫోన్ చేయగా, ప్రమాద స్థలంలో ఉన్నవారు ఫోన్ తీసి రాంజీ చనిపోయాడని చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయిందని బంధువులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహేశ్వరిని రామ్ జీ వివాహం చేసుకున్నాడు. వీరికి 5 నెలల కుమారుడు ఉన్నాడు. అలాగే వాక శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు