భారీ వర్షాల కారణంగా కొండచరియలు (Landslides) విరిగిపడి కనీసం 36 మంది మృతి చెందిన ఘటన దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వరద బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్ల ద్వారా అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగింది. మిస్కి అనే మారుమూల ప్రాంతంలో 36 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు కమానా ప్రావిన్స్‌లోని మరియానో నికోలస్ వాల్కార్సెల్ మునిసిపాలిటీలో పౌర రక్షణ అధికారి విల్సన్ గుటిరెజ్ తెలిపారు.
కొండచరియలు విరిగిపడటంతో పెను విధ్వంసం
దక్షిణ పెరూలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొట్టుకుపోయిన మట్టి, నీరు, రాళ్ల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 36 మంది మరణించారు. ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. మరణించిన వారిలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. బలమైన బురద ప్రవాహానికి కారు నదిలో కొట్టుకుపోయింది. చాలా చోట్ల రోడ్లను దిగ్బంధించారు. శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల వంతెనలు, నీటిపారుదల కాలువలు కూడా ప్రభావితమయ్యాయి.
Also Read: Congress Leader Nephew: దారుణం.. కాంగ్రెస్ నేత మేనల్లుడు కిడ్నాప్, హత్య
గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా కైమానా ప్రావిన్స్‌లోని సికోచా పట్టణానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మరో ఐదుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పెరూ జాతీయ అత్యవసర కేంద్రం COEN తెలిపింది. హెలికాప్టర్లు, టెంట్లు, వాటర్ ట్యాంకులు, ఇసుక సంచులు, విపత్తు సహాయక సిబ్బందిని అందించడం ద్వారా ప్రయత్నాలకు సహాయం చేస్తున్నట్లు పెరూవియన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది.
ప్రస్తుతం ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం బృందం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతానికి అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అరెక్విపా అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు AFP వార్తా సంస్థ పేర్కొంది. డిసెంబరు 7న మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో బహిష్కరణ తర్వాత జరిగిన భారీ ప్రభుత్వ వ్యతిరేక కవాతుల్లో అనేక మంది చనిపోయారు. దీని తరువాత, ఇప్పుడు కొండచరియలు విరిగిపడిన సంఘటన దేశానికి కష్టాలను పెంచింది.