Site icon HashtagU Telugu

Manipur Violence : మణిపూర్ హింసాకాండ.. మరో ముగ్గురు మృతి

Manipur Violence

Manipur Violence

Manipur Violence  : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో జరిగిన అల్లర్లలో ముగ్గురు “గ్రామ వాలంటీర్లు” మరణించారు.  వీరు గ్రామంలోని తాత్కాలిక బంకర్‌లో కాపలాగా ఉండగా..  గుర్తు తెలియని ముష్కరులు వచ్చి జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. చికిత్స నిమిత్తం ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Also read : Disqualification Petition : తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎన్సీపీ అనర్హత పిటిషన్లు.. నెక్స్ట్ ఏమిటి ?

NH-2 జాతీయ రహదారిపై దిగ్బంధం ఎత్తేసిన కుకీ సంస్థలు

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు కుకీ సంస్థలు  యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (UPF), కుకి నేషనల్ ఆర్గనైజేషన్ (KNO) మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లా పరిధిలోని NH-2 (ఇంఫాల్-దిమాపూర్) జాతీయ రహదారిపై రోడ్‌బ్లాక్‌లను ఉపసంహరించుకున్నాయి. హైవేపై దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేసినట్లు  ఆ సంస్థలు ప్రకటించాయి. రాష్ట్రంలో శాంతి సామరస్యాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర  హోం మంత్రి  శ్రద్ధ చూపించారని అవి  వెల్లడించాయి. మణిపూర్‌లో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. అవి NH-2 (ఇంఫాల్-దిమాపూర్), NH-37 (ఇంఫాల్-జిరిబామ్). మేలో మణిపూర్‌లో హింస(Manipur Violence) చెలరేగినప్పటి నుంచి NH-2 కుకీ సంస్థల దిగ్బంధంలో ఉంది.